ఒకరిద్దరితోనే బడి!
- ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత.. చాలా చోట్ల ఐదు తరగతులకు ఒక్కరే..
- బోధనేతర పనులకే సగం సమయం
- ముందుకు సాగని పాఠాలు
- తరగతికి ఒక టీచర్‌ను నియమించాలంటున్న సంఘాలు
జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) వడ్డెపల్లి మండలం జిల్లేడుదిన్నె ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్. రాజోలి పాఠశాలలో 230 మంది విద్యార్థులకు ఐదుగురు.. తిమ్మాజిపల్లిలో 78 మంది విద్యార్థులకు ఇద్దరు.. మల్ దక్కల్ మండలం నేతివానిపల్లి తండాలో 42 మంది విద్యార్థులకు ఒక్కరే.. కేటీదొడ్డి మండలం రంగాపురం పాఠశాలలో 110 మంది విద్యార్థులకు గాను ఇద్దరు ఉపాధ్యాయులు.. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇదే పరిస్థితి.
ఉపాధ్యాయుల కొరతతో ఒకరిద్దరు టీచర్లే అన్ని తరగతులు నిర్వహించాల్సి వస్తున్నది. ఫలితంగా బోధనపై ప్రభావం పడటమే కాకుండా, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పలుచోట్ల అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందని, తరగతికి ఒకరి చొప్పున టీచర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు(Primary Schools) కేవలం ఒకరిద్దరు టీచర్లతోనే నెట్టుకొస్తున్నాయి. 80 నుంచి 120 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి.- ఒకే గదిలో 1, 2, 3 తరగతులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు టీచర్లు లేని చోట 1 నుంచి 5వ తరగతి వరకూ ఒకే టీచర్ 18 సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. ఇలా మల్టీ గ్రేడ్ బోధనతో పిల్లలకు ఏమీ అర్థంకాని పరిస్థితి. మరోవైపు కొన్ని చోట్ల టీచర్లు ఉన్న చోట విద్యార్థులుండరు.
టీచర్ లేని చోట ఉన్న ఆ ఒక్క టీచర్‌పై భారం విపరీతంగా పడుతోంది. పాఠాలు చెప్పడం ఒక ఎత్తయితే.. బోధనేతర పనులు మరో ఎత్తు. ఇవి ఉపాధ్యాయులకు భారంగా మారింది.- ప్రతిరోజూ విద్యార్థుల హాజరు నమోదు, మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్, యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీ లెక్కలు, రికార్డులు నిర్వహణ, మీటింగ్‌లు, రిపోర్టులు తయారీ, పాఠశాలల తనిఖీలు లాంటి అనేక పనులతో రోజంతా సరిపోతుందని, సరిపడా టీచర్లు లేకపోవడంతో బోధనకు ఆటంకం కలుగుతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ఒక టీచర్‌తో అన్ని తరగతులెలా?
ఉపాధ్యాయుల కొరత వల్ల ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. ఐదేళ్ల పిల్లాడికి అ, ఆలు దిద్దిస్తూనే, పదేళ్ల్ల పిల్లాడికి లెక్కలు ఎలా చెప్పగలం? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఒకే టీచర్ స్కూల్ మొత్తాన్ని కంట్రోల్ చేయడంతో పాటు అన్ని తరగతులకు ఎలా విద్యాబోధన చేస్తారని నిలదీస్తున్నారు. ఆ రోజు టీచర్ సెలవు పెడితే ఇక అంతే సంగతులు.
పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ టీచర్ లేదా పక్క స్కూల్‌లో మరో ఉపాధ్యాయుడు బాధ్యతలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తరగతికి ఒక ఉపాధ్యాయుడుండాలని కోరుతున్నారు. జీవో నెం.25ను సవరించి ప్రతి పాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఎస్జీటీలను నియమించాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో పాఠశాలల వాస్తవ పరిస్థితులపై పరిశీలన చేయించి ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
సర్దుబాటు చేసినా చక్కబడని పరిస్థితులు..
ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారులు టీచర్ల సంఖ్య తక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయులను చేశారు. అయినా పరిస్థితులు చక్కపడలేదు. ఇష్టానుసారంగా టీచర్ల సర్దుబాటు జరిగిందన్న ఆరోపణలున్నాయి. పిల్లలు లేని పాఠశాలల్లో టీచర్లు ఉంటే.. విద్యార్థులున్న చోట ఉపాధ్యాయులు ఉండని స్కూళ్లూ ఉన్నాయి. -తరగతికి ఒక టీచర్ విధానం అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా, 1- తరగతులు ఉంటే 5 మంది టీచర్లను నియమించాలి.
ఇదే నాణ్యమైన విద్యకు మార్గమని పేర్కొంటున్నారు. కానీ అధికారులు మాత్రం సరిపడా టీచర్లు ఉన్నారని, జాతీయ సగటు కంటే మన దగ్గర ఎక్కువగానే (1:17 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి) ఉన్నారని చెబుతుండటం గమనార్హం. బోధనకు ఆటంకం కలగకుండా, ఉన్న వారిపై ఒత్తిడి పడకుండా, ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.