నేలమట్టం చేద్దాం!

01-10-2026 | 05:35am

సిరిసిల్ల గడీల మీదనే గురి.. ఫిరంగులమై పేలుదాం!

  1. ఉద్యమాన్ని, ఓట్లను కేసీఆర్ పచ్చనోట్లుగా మార్చుకున్నడు
  2. కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు కొల్లగొట్టిండు
  3. మీరు ఫామ్‌హౌస్‌లు కట్టుకొని.. పేదలకు ఇండ్లయినా కట్టించారా?
  4. హైటెక్ సిటీలో మీ ఫైవ్‌స్టార్ హోటళ్ల కథ తెలియదా..
  5. వాటిని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటా!
  6. అమెరికా, సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టలేదా?
  7. సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేసిన మొనగాడికి మంత్రివర్గంలో చోటు
  8. రాబోయే ఎన్నికల్లో పద్మశాలి బిడ్డ మండలికి..
  9. కరీంనగర్ కలెక్టరేట్‌కు రిబ్బన్ కట్ చేయకుండా బస్టాండ్‌లో జేబులు కట్ చేశారు
  10. దళిత బిడ్డలను అవమానిస్తారా?: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రపంచంలోనే ధనిక కుటుంబంగా ఆనాడు నిజాం నవాబుకు పేరుంటే.. ఇప్పుడు కేసీఆర్(KCR) తెలంగాణ ఉద్యమాన్ని, సిరిసిల్ల ఓట్లను సొమ్ముగా మార్చుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. పేదలకు ఇండ్లు నిర్మించలేదు కానీ.. వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. సిరిసిల్ల నేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి నయా పైసా సాయం చేయలేదు.

-ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

సిరిసిల్ల, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఓట్లను కేసీఆర్(KCR) అండ్ ఫ్యామిలీ పచ్చనోట్లుగా మార్చుకొని.. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నదని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. ఇప్పటికే ఆ కుటుంబం ఆస్తుల చిట్టా విప్పామని, పార్ట్ 2 త్వరలో బయటపెడుతామని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ గడీలను బద్దలు కొట్టామని, ఇక మిగిలింది సిరిసిల్ల(Sircilla) గడీలేనని చెప్పారు. ‘సిరులకు నిలయం సిరిసిల్ల.

ఆరుసార్లు కేటీఆర్‌ను ఇక్కడి ప్రజలు గెలిపిస్తే.. సిరిసిల్లను ఉరిసిల్ల చేసిండు. జనం ఓట్లతో వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టుకున్నడు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నడు. అమెరికాలో ఆయన బాత్రూమ్‌లు, చిప్పలు కడిగితే ఇంత ఆస్తి వచ్చిందా?’ అని ప్రశ్నించారు. సిరిసిల్ల గడీలపై గురిపెట్టాలని, ఫిరంగులై పేలుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ గడీలను నేలమట్టం చేద్దామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కరీంనగర్, సిరిసిల్లలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోతవ్సాలు చేశారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. 

వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినయ్?

తెలంగాణ ఉద్యమ సమయంలో పాపారావు, కేకే మహేందర్‌రెడ్డి వంటి వారు సిరిసిల్ల అభివృద్ధి కోసం పనిచేస్తే... చీమలు పెట్టిన పుట్టలో విషపుపాములు చేరినట్టుగా 2009లో ఇక్కడికి కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌(KTR)ను దిగుమతి చేసి ఎన్నికల్లో దింపారని ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2009 ఎన్నికల్లో కేవలం 172 ఓట్లతో సిరిసిల్లలో అతికష్టమ్మీద కేటీఆర్ గెలిచిండు.

తర్వాత వరుసగా ఇక్కడి వాళ్లు గెలిపిస్తే.. ఆ ఓట్లతో కేటీఆర్ ఆస్తులు కూడగట్టుకున్నడు. దాదాపు అర డజను సార్లు సిరిసిల్లలో కేటీఆర్‌ను గెలిపించినా ఇక్కడి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదు? గల్ఫ్ దేశాలకు వలసలు ఎందుకు తగ్గలేదు. ఆ కుటుంబాలకు నయా పైసా అయినా సాయం చేశారా?’ అని ఆయన ప్రశ్నించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఆది శ్రీనివాస్(Aadi Srinivas), ఈరవర్తి అనిల్ ఎన్నోసార్లు ప్రతిపాదనలు తీసుకొచ్చారని.. అందుకే తమ ప్రభుత్వం వలస కార్మికుల కోసం ప్రత్యేక విధానం తీసుకొచ్చి, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. ‘అమెరికాలో కేటీఆర్ పనిచేసిన సమయం లో బాత్రూమ్‌లు కడిగినా, హోటళ్లలో పాత్ర లు కడిగినా.. అంత తక్కువ కాలంలోనే వేల కోట్ల రూపాయల సంపద ఎట్లొచ్చింది? సిరిసిల్ల ప్రజలు కూడా విదేశాలకు వలస వెళ్తున్నారు.

వారు ఎంత సంపాదిస్తున్నరో అందరికీ తెలుసు. కానీ, కేటీఆర్ సంపద ఎలా పెరిగిందో ప్రజలు ప్రశ్నించాలి. ‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ .. నాడు మానేరు ఇసుక దోపిడీ జరిగింది. నేరెళ్ల ఘ టనలో దళితులపై పోలీసులు దాడి చేశారు.. కరెంటు షాక్ పెట్టి వారి జీవితాలను నాశనం చేశారు. ఇవన్నీ కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్ చేశాడు కదా!  ఆనాడు తెల్ల రేషన్‌కార్డు దారులుగా చూపించుకున్నవాళ్లు ఇ ప్పుడు వేల కోట్ల ఆస్తులకు ఎలా వారసులయ్యారు? ఒకరు గోదావరి జలాలను కొల్ల గొడితే.. ఇంకొకరు మానేరు ఇసుకను దోచుకున్నరు.. మరొకరు హైదరాబాద్‌లో ఆంధ్ర వ్యాపారులతో చేతులు కలిపి భూములు కొట్టేశారు’ అని సీఎం ఆరోపించారు. 

దేవుళ్లకు కేసీఆర్ శఠగోపం

నేత కార్మికులు, గీత కార్మికులు, రైతులను ఆదుకుంటామని చెప్పి.. చివరకు వారిని గోదావరిలో నట్టేట ముంచారని కేసీఆర్, కేటీఆర్‌పై సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘వేములవాడ రాజన్నకు, భద్రాద్రి రాముడికి కూడా శఠగోపం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరే. 2014 అధికా రంలో వచ్చాక... ఈ రెండు దేవాలయాలకు నిధులు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వని దుర్మార్గులు వాళ్లు. మా ప్రభు త్వం కేవలం రెండున్నరేండ్లలో చేనేత కార్మికుల కోసం రూ.1,730 కోట్లు ఖర్చు చేసింది.

అదే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ.2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వేములవాడ అభివృద్ధికి రూ.1,500 కోట్లు ఇచ్చాం. ఇక్కడే యంగ్ ఇండియా స్కూల్, ఎంఆర్‌ఓ కార్యాలయాలు, మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశాం’ అని వివరించారు. ‘కేటీఆర్‌కు నా గురించి గానీ, కాంగ్రెస్ గురించి గానీ సరిగ్గా తెలియదు.

తెలుసుకోవాలనుకుంటే ఫామ్‌హౌస్‌లో ఉన్న వాళ్ల నాయనను అడగాలి. రాజకీయ దెబ్బ అంటే ఏమిటో.. 2023లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన దెబ్బ ఎట్లుందో కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలి. గజ్వేల్ గడీపై గురిపెట్టి కేసీఆర్‌ను గద్దెదించాం. ఇప్పుడు సిరిసిల్ల గడీపై గురిపెట్టి  మర ఫిరంగుల్లా పేలుతారు. ఆ గడీని నేలమట్టం చేసే బాధ్యత సిరిసిల్ల ప్రజలు తీసుకుంటారు. సిరిసిల్లలో పాదయాత్ర చేస్తుంటే ప్రజల కండ్లలో మార్పు స్పష్టంగా కనిపించింది’ అని సీఎం అన్నారు. 

దళితులు నడిస్తే శుద్ధి చేయిస్తావా?

‘దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని.. ఇట్లా ఎన్నో చెప్పిన కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణ ఉద్యమాన్ని అడ్డంపెట్టుకొని, ఓట్ల ను  వేయించుకొని వాటిని పచ్చనోట్లుగా మార్చుకున్నడు. కుటుంబ ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు పెంచుకున్నడు.

వాళ్లు(కేసీఆర్ కుటుంబం) ఫామ్‌హౌస్‌లు మాత్రం సకాలం లో పూర్తి చేసుకున్నరు.. మరి పేదల కోసం ఇచ్చిన హామీలను ఎందుకు పూర్తి చేయలేదు? పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు కట్టియ్యలేదు?’ అని సీఎం రేవంత్ నిలదీశారు.

‘నేను సిరిసిల్ల ప్రజలను అడుగుతున్న! మళ్లీ గడీల వైపు, రాతియుగం వైపు వెళ్లాలా? లేక ప్రజల తెలంగాణ వైపు ముం దుకు సాగాలా? కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక దళితుడిని స్పీకర్‌గా నియమిస్తే.. ఆయనను ‘అధ్యక్షా’ అని సంబోధిం చాల్సి వస్తుందనే కారణంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు.

దళిత స్పీకర్‌పై బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ కనీసం ఖండించలేదు. దళితులు నడిస్తే నేలను పసుపు నీళ్లతో కడుగుతారా? అంత అహంకారం ఎందుకు?. మన ప్రాంత దళితులు ఆకలినైనా భరిస్తారని, కానీ అవమానాన్ని మాత్రం భరించరు. కేసీఆర్‌కు తెలంగాణ సమాజం తగిన బుద్ధిచెప్తుంది’ అని హెచ్చరించారు. 

కేసీఆర్ ఆస్తుల చిట్టాపై త్వరలో పార్ట్ 

కేసీఆర్, కేటీఆర్ దమ్ముంటే వాళ్ల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘కేటీఆర్‌కు దమ్ముంటే కేసీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. జన్వాడలో కేటీఆర్‌కు ఫామ్‌హౌస్, శంకర్‌పల్లిలో కవితకు ఫామ్‌హౌస్, మొయినాబా ద్‌లో హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్, ఎర్రవల్లిలో కేసీఆర్ ఫాంహౌస్.. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?’ అని ఆయన ప్రశ్నించారు.

హైటెక్ సిటీ చుట్టుపక్కల డెక్కన్ సెరాయ్, ఎట్ హోమ్ సర్వీస్ అపార్‌మెంట్లు, దాదాపు 400 గదుల హోటళ్లు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఎక్కడి నుంచి వచ్చాయని సీఎం ప్రశ్నించారు. ‘ఇవి కేసీఆర్ కుటుంబ సభ్యులు, వారి అనుచరులవి కాదా? నేను నిరూపిస్తాను.. నిరూపించకపోతే పేరు మార్చుకుంటా. వీటిపై సమాధా నం చెప్పే దమ్ము కేటీఆర్‌కు ఉందా? అమెరికా, సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టింది వాస్తవం కాదా?! ఇవన్నీ ఇన్నాళ్లూ మేం చెప్పలేదు. పార్ట్-2 ఉంది. అన్నీ బయటపెడుతాం’ అని స్పష్టం చేశారు. 

సిరిసిల్లలో గెలిస్తే మంత్రివర్గంలోకి

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక పద్మశాలి బిడ్డను పెద్దల సభకు పంపించాలని ప్రజలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. గతంలో వైఎస్, డీఎస్ జోడీ ఉంటే.. ఇప్పుడు రేవంత్, మహేశ్ జోడీ బలంగా పని చేస్తున్నదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘బీఆర్‌ఎస్, కేసీఆర్, కేటీఆర్ ఇక గతం. ఇకపై అంతా కాంగ్రెస్.. అంతా మూడు రంగుల జెండానే. 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. నేరెళ్ల బాధితుల సాక్షిగా.. బీఆర్‌ఎస్ రాజకీయాలకు ముగింపు పలికేందుకు సిరిసిల్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నా. సిరిసిల్ల గడ్డపై జెండా ఎగురవేసే మొనగానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తాం. సిరిసిల్ల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే బాధ్యతను నేను తీసుకుంటా’ అని సీఎం రేవంత్ తెలిపారు. 

నేతన్నల కోసం రూ.1,741 కోట్లు

సిరిసిల్ల, వేములవాడలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు, ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, రుద్రంగిలో గోదాముల నిర్మాణం తదితర పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. పెద్దూరులో రూ.5 కోట్లతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని, వేములవాడ మహిళా పోలీస్ స్టేషన్‌ను, సిరిసిల్లలో, వేములవాడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.

వెయ్యి రోజుల ప్రజాపాలనలో నేత కార్మికుల సంక్షేమం కోసం రూ.1,741 కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.1,700 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. సిరిసిల్ల నేతన్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు నేత బజార్ ఏర్పాటు, చేనేత పవర్లూమ్ రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు.

కాగా, మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ నేరెళ్ల బాధితులు, నేతన్నలు, ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. సభ అనంతరం నేరెళ్ల బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. సభకు ముందు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర దాదాపు 6,000 మందితో భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి సీఎం చేరుకున్నారు. 

థూ మీ బతుకు చెడా..!  బతుకమ్మ చీరల్లో కమీషన్లు కొడ్తరా?

బీఆర్‌ఎస్ నాయకులు ఆఖరికి బతుకమ్మ చీరల పంపిణీలో కూడా కమీషన్లు తీసుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ప్రపంచంలో ఆనాడు ధనిక కుటుంబంగా నిజాం నవాబు పేరుంటే.. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఓట్లను  సొమ్ముగా మార్చుకొని రూ. వేల కోట్ల ఆస్తులు కేసీఆర్ కుటుంబం సంపాదించుకుంది.

విలాసవంతమైన జీవితం గడుపుతున్నరు. వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నరు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టారు. థూ మీ బతకు చెడా.. బతుకమ్మ చీరల్లో కూడా కమీషన్లు కొడ్తరా? ఆడబిడ్డలకు ఇచ్చే చీరల్లో కమీషన్లు కొట్టెటోళ్లు దుమ్ముకొట్టుకపోతరు’ అని ఆయన హెచ్చరించారు. నాడు కరీంనగర్ కలెక్టరేట్‌కు రిబ్బన్ కట్ చేయకుండా బస్టాండ్‌లో జేబులు కట్ చేశారని కేసీఆర్, కేటీఆర్‌ను దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు