కామారెడ్డిలో నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan), జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాసులు ప్రారంభించారు. యువజన సమాఖ్య గణపతి కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద గణనాథునికి కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించే కార్యక్రమంలో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులు, ప్రజలు శాంతియుతంగా పాల్గొని పోలీసు, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, అధికారులు, యువజన సమాఖ్య అధ్యక్షుడు రాజు, రామ్ కుమార్ గౌడ్, నర్సింలు, మల్లేష్ యాదవ్, పుల్లూరు సతీష్, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సామల గంగారెడ్డి, జంగం నరేష్, రమేష్, పోలీసు సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.