విద్యుదాఘాతంతో రైతు మృతి..

23-09-2026 | 10:54pm

విషాదంలో కుటుంబ సభ్యులు...

తాడ్వాయి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఎండనక, వాననక రాత్రనకా, పగలనకా చెలక చేనునే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతన్నలకు ప్రమాదాలు తప్పడం లేదు. రైతులకు ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితిలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామంలో బుధవారం ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎం.డి నాసిర్ (56) అనే రైతు రోజు మాదిరిగానే తన పొలానికి నీళ్లు పారించడం కోసం వెళ్ళాడు.

అక్కడే ఉన్న కరెంటు మోటార్ స్టార్టర్ డబ్బాలో ఉన్న స్టార్టరు బటన్ నొక్కడానికి చేయి పెట్టాడు.చేయి పెట్టిన సమయంలోనే ఒక్కసారిగా విద్యుదాఘాతానికి  గురయ్యాడు.అక్కడే పడిపోయాడు.తన తండ్రి పొలానికి వెళ్లి ఇంకా రావడంలేదని కుమారుడు పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా నాసిర్ స్టార్టర్ డబ్బా పక్కనే పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి వెంటనే చికిత్స కోసం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు పరీక్షించి ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి మృతి చెందిన రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ మంగారెడ్డి, గ్రామస్తులు కోరుతున్నారు. మృతుడికి భార్య సాహిదా బేగం, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు