గుండి బ్రిడ్జిపై కోవ లక్ష్మికి సుగుణక్క కౌంటర్‌

31-10-2026 | 01:39pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గుండి బ్రిడ్జి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదంటూ ఎమ్మెల్యే కోవ లక్ష్మి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. శనివారం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. గుండి బ్రిడ్జి నిర్మాణానికి బీజం పడింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేనని స్పష్టం చేశారు.

నిర్మాణ పనులు ప్రారంభమైన సమయంలో తెలంగాణ ఉద్యమం కారణంగా అప్పటి కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారని గుర్తుచేశారు. అనంతరం పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కూడా పూర్తికాకముందే విమర్శలు చేయడం సరికాదన్నారు.

గతంలో మంత్రి సీతక్క గుండి బ్రిడ్జిని సందర్శించి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని ఆత్రం సుగుణక్క తెలిపారు. ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం నిధులు మంజూరు చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.

ఈ సమావేశంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్, మండలాల అధ్యక్షులు రాపర్తి మురళి, ఇమ్రాన్, సుజాహిద్ ఖాన్, రమేష్ జాదవ్, కిషన్ గౌడ్, చునర్కర్ మహేష్, డీసీసీ కార్యవర్గ సభ్యులు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ వైఖరి (Congress Stand), నిధుల కేటాయింపు (Fund Allocation), నిర్మాణ పనుల పురోగతి (Construction Progress), రాజకీయ విమర్శలు (Political Remarks) ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.

మరిన్ని వార్తలు