20 ఏళ్లుగా అసంపూర్తిగా గుండి వంతెన

26-10-2026 | 12:42pm

సమస్య పరిష్కారం కోసం సీఎం వద్దకు సైకిల్ యాత్ర

ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామ వంతెన నిర్మాణం గత 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు వంతెన వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం ఆరుగురు యువకులు సైకిల్ యాత్ర ప్రారంభించారు. గుండి వంతెన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామం నుంచి రాష్ట్ర సచివాలయానికి సైకిల్‌పై వెళ్లాలని యువకులు నిర్ణయించుకున్నారు. తమ టీషర్టులపై “మాది తెలంగాణ.. మమ్మల్ని గుర్తించండి” అనే నినాదాన్ని ముద్రించగా, ఫ్లకార్డులపై “హామీలు కాదు.. మాకు శాశ్వత పరిష్కారం చూపాలి” అంటూ ప్రదర్శించారు.

వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో గత రెండు దశాబ్దాలుగా వైద్యం, విద్యతో పాటు అత్యవసర పనుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదని పేర్కొన్నారు. అందుకే సైకిల్ యాత్ర ద్వారా తమ కష్టాలను ముఖ్యమంత్రికి వివరించాలని నిర్ణయించుకున్నట్లు యువకులు తెలిపారు. ముఖ్యమంత్రి తమ సమస్యను స్వయంగా వివరించేందుకు కనీసం ఐదు నిమిషాల సమయం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుండి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి, గ్రామస్థుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

మరిన్ని వార్తలు