రాహుల్‌గాంధీకి తెలంగాణ ఏటీఎం
- ఆయనకు రేవంత్ స్వైపింగ్ కార్డ్
- రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి స్కాం వెనుక ఢిల్లీ పెద్దల ‘హస్తం’
- కాంగ్రెస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి లేదు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
- కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి జిబ్రాన్ షరీఫ్, భార్గవ్ దేశ్‌పాండే
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి(Senior Congress leader Rahul Gandhi) ఏటీఎంగా మార్చారని, ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్వైపింగ్ కార్డులా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి స్కాం వెనుక ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని, తెలంగాణ సొమ్ముతో దేశమంతా రాజకీ యం చేయాలని చూస్తున్నారని ఆరోపిం చారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే తిట్ల పురాణం, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ సీనియర్ నాయకుడు జిబ్రాన్ షరీఫ్ బీఆర్ఎస్లో చేరగా, ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో వివాదాలు, అక్రమాలు, అవినీతి ఆరోపణలు నిత్యకృత్యంగా మారాయన్నారు. ప్రభుత్వంలోని పెద్దల కుటుంబ సభ్యులకు సంబంధించిన భూముల వ్యవహారాలు, వ్యాపార ఒప్పందాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.
సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే తన తమ్ముడికి రేవంత్ బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. అలాగే అమెరికాలో నివసిస్తున్న సీఎం మరో తమ్ముడికి సంబంధించినదిగా పేర్కొంటున్న రూ.1000 కోట్ల డీల్‌పై సమగ్ర వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అక్రమాలు, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానమివ్వడంతో పాటు, పారదర్శకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు జరుగుతున్నా రాహుల్‌గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
హామీలిచ్చి.. హ్యాండిచ్చి..
ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటి అమలును విస్మరించిందని కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్‌గాంధీ ప్రజలకు మాట ఇచ్చారని గుర్తుచేశారు. వెయ్యి రోజులు గడుస్తున్నా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్న రాహుల్..
తెలంగాణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో టీ స్టాల్ వద్ద కూర్చొని నిరుద్యోగ యువతకు హామీలిచ్చిన రాహుల్‌గాంధీ, ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు.
మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్, అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రూ.4,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్, రైతులకు పెట్టుబడి సాయం పెంపు తదితర హామీలన్నీ విస్మరించారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం, అరెస్టులతో భయపెడుతున్నారని ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలోనూ ఇలాంటి ధోరణులే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో మతతత్వ రాజకీయాలను అడ్డుకునే దమ్ము, ప్రధాని మోదీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదని.. అది కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని, పేదలు, రైతులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
2028లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ నిలబెడుతారని ప్రకటించారు. మైనారిటీ నేత జిబ్రాన్ షరీఫ్ బీఆర్ఎస్లో చేరడం ఖైరతాబాద్ నియోజకవర్గంలో పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ పాలనలోనే హైదరాబాద్‌కు భరోసా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు హైదరాబాద్‌లో కరెంటు కోతలు, నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆ సమస్యలన్నీ తీర్చడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా పదేళ్లపాటు శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యమిచ్చి పాలన సాగించారని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరం గంగా-, యమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలిచేలా మత సామరస్యాన్ని కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. తమ ప్రభుత్వ పనితీరును గుర్తించిన హైదరాబాద్ ప్రజలు.. బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు భార్గవ్ దేశ్‌పాండే గుడ్ బై
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎన్ఎస్యూఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భార్గవ్ దేశ్ పాండే కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం కలిగిన నాయకుల చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని ఆరోపించారు.డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు సైతం రేవంత్‌రెడ్డికి సరెండర్ అయ్యారని విమర్శించారు. రేవంత్ చుట్టూ ఉన్న నలుగురైదుగురు కీలక నేతలు తప్ప.. మరెవ్వరూ బాగుపడలేదని విమర్శించారు.
ఇది అసలైన కాంగ్రెస్ కాదని.. తెలుగుదేశం, ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తున్న కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. ‘లీవ్ కాంగ్రెస్.. సేవ్ తెలంగాణ’ అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిజాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.