ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయించాలి

02-10-2026 | 11:52pm

జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్

కాగజ్ నగర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి, సీట్లు కేటాయించాలని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్(Gajjala Laxman) రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. శుక్రవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు ఇస్తున్నట్టు ప్రచారం సాగుతుందని.. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి, ఎమ్మెల్సీ సీట్లను దామాషా పద్ధతిన మెజారిటీ సంఖ్యాకులైన బీసీల కేటాయించాలని అన్నారు. అలాగే రాష్ట్రంలోని మిగతా బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు సైతం  బీసీలకు టికెట్లు ఇవ్వాలని కోరారు. అలాగే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో  సైతం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర మంత్రివర్గంలో గల ఏకైక బీసీ మహిళ కొండ సురేఖను అకారణంగా మంత్రివర్గం నుంచి తప్పించడం ఎంత వరకు  సమంజసమని  ప్రశ్నించారు. ఈ సమావేశంలో  మున్నూరు కాపు సంఘం  సిర్పూర్ నియోజకవర్గం అధ్యక్షులు  దెబ్బటి జలపతి, జిల్లా కార్యదర్శి అంగల తిరుపతి, ఉపాధ్యక్షులు బొలిశెట్టి మహేష్, కాగజ్ నగర్ మండల యూత్ అధ్యక్షులు  పర్వతి సురేష్, కార్యదర్శి సైదం అశోక్, కాగజ్నగర్ పట్టణ అధ్యక్షులు  చిట్టంపల్లి అనిల్ కుమార్, పట్టణ యూత్  కోశాధికారి పులి శెట్టి వెంకటేష్, కొంగ శ్రీనివాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు