వర్క్ అడ్జస్ట్మెంట్.. విద్యార్థులకు శాపం..!
- ఒకే ఉపాధ్యాయుడితో విద్యార్థులకు విద్య బోధన
- వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో..మరో పాఠశాలలో విధులు
- విద్యార్థులకు అందని మెరుగైన విద్య
- పట్టించుకోని సంబంధిత అధికారులు..?
బెజ్జూర్ అక్టోబర్ 4 (విజయ క్రాంతి) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad district) బెజ్జూరు మండలంలోని పాపన్నపేట ప్రాథమిక పాఠశాలలో(Papannapet Primary School) ఓ ఉపాధ్యాయురాలు వర్క్ అడ్జస్ట్మెంట్ తో వెళ్లడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 144 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా 109 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 35 మంది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పాపన్నపేట పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఫిబ్రవరి 2025 నుండి సెప్టెంబర్ 2025 వరకు మాత్రమే విధులు నిర్వహించి వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో కాగజ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నట్లు పాపన్నపేట్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత నెలలో సర్వసభ్య సమావేశంలో కూడా గ్రామ సర్పంచ్, మండల విద్యాధికారి ఆ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉండడంతో విద్యార్థుల విద్యాబోధన విషయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిగా నెలకొందని తెలిపారు.
ఈ విషయమై మండల విద్యాధికారి సునీత జిల్లా విద్యాధికారి తో తెలపడంతో ఆ ఉపాధ్యాయురాలని మళ్ళీ పాఠశాలకు విధులు నిర్వహించాలని ఆదేశించడంతో కొన్ని రోజులు మాత్రమే పాఠశాలకు వచ్చి ఎఫ్ ఆర్ ఎస్ విషయంలో సమయపాలన తో పాఠశాలకు హాజరుకాక పోవడంతో ఓ పలుకుబడి ఉన్న నాయకుడి పైరవీలతో మళ్ళీ కాగజ్నగర్ లోనే వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు రాక సంవత్సరం గడుస్తున్న ఇట్టి విషయమై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఈ పాఠశాలలో మాత్రం మరో ఉపాధ్యాయుని ఏర్పాటు చేయడంలో విద్యాశాఖ అధికారులు చొరవ చూపడం లేదని దీనితో విద్యార్థులకు విద్యాబోధన ఎలా అందుతుందని చదువు సాగేది ఎలా అని గ్రామ సర్పంచ్, గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలలో 57 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఓకే ఉపాధ్యాయుడు ఉండడంతో విద్య బోధన విషయంలో ఇబ్బందిగా మారిందని, అయినప్పటికీ ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సంకల్పంతో ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు అయినప్పటికీ విద్యార్థుల విద్యా బోధన వారికి వసతులు సమకూర్చడంలో లోటు లేకుండా చూస్తున్నట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లకు నీటి వసతి తన సొంత డబ్బులతోటి సమకూర్చినట్లు తెలిపారు.
తాను అత్యవసర సమావేశాలకు వెళ్లాలన్న, సెలవు తీసుకోవాలన్న ఇబ్బందిగా మారిందని ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలో చేతి పంపు చెడిపోయి ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పెంచికల్పేట్ మండలంలోని చెడువాయి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు లేక విద్యార్థులకు విద్యా బోధన సాగడం లేదని ఇట్టి విషయమై అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇట్టి విషయమై జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారిని వివరణ కోరెందుకు ఫోన్ చేసినప్పటికీ అందుబాటులోకి రాలేదు. పాపన్నపేట పాఠశాలలో ఉపాధ్యాయురాలి అడ్జస్ట్మెంట్ వ్యవహారం ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..?