ఎత్తిపోతలు కాదు.. ఉత్తిపోతలే..!

19-10-2026 | 05:25am
  1. ఏళ్లుగా మూలకు చేరిన ఎత్తిపోతల పథకాలు
  2. సామగ్రి చోరీకి గురై.. మూగబోయిన మోటార్లు
  3. సాగుకు భరోసా కరువు.. బోర్లు, వర్షాలపైనే రైతుల ఆశలు

కౌటాల, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రైతులకు సాగునీటి భరోసా కల్పించాల్సిన ఎత్తిపోతల పథకాలు(Lift irrigation schemes) ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండటంతో వాటి లక్ష్యం నీరుగారిపోతోంది. నదుల్లో నీరు పుష్కలంగా ఉన్నా పొలాలకు మాత్రం చేరని పరిస్థితి నెలకొంది.కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన పథకాలు నిర్వహణ లోపాలు, మరమ్మతుల నిర్ల క్ష్యం, సామగ్రి చోరీ ఆరోపణల మధ్య మూలకు చేరు తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కు మురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వీర్ధండి, గోండాయి పేట్, సాండ్గాం, తుమ్మిడిహట్టి ఎత్తిపోతల పథకాల దుస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఏళ్లుగా పనిచేయని పథకాలు...

సాండ్గాం ఎత్తిపోతల పథకం సుమారు ఏడేళ్లుగా పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. గోండాయిపేట్ ఎత్తిపోతల పథకం ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉందని, అక్కడి సామగ్రి చోరీకి గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. వీర్ధండి ఎత్తిపోతల పథకా నికి సంబంధించిన రాగి సామగ్రి చోరీకి గురైందని స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు, తుమ్మిడిహట్టి ఎత్తిపోతల పథకం సుమారు ఎనిమిదేళ్లుగా దెబ్బతిన్న స్థితిలో ఉందని చెబుతున్నారు. ఇన్ని ఏళ్లుగా పథకాలు పనిచేయకపోతున్నా వాటిని పునరు ద్ధరించేందుకు తీసుకున్న చర్యలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మోటార్లు బాగు చేయరా...? 

ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు, విద్యుత్ పరికరాలు కీలకమైనవి. అవి పనిచేయకపోతే సాగునీటి సరఫరా నిలిచిపోతుం ది. పా డైన మోటార్ల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారా? నిధులు కేటా యించారా? కేటాయించిన నిధులను ఖర్చు చేశారా? పథకాల నిర్వహణ బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న లకు సంబంధిత అధి కారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏళ్ల తరబడి సమస్య కొనసాగుతున్నా పర్యవేక్షణ వ్యవస్థ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నదుల్లో నీరు.. పొలాలకు మాత్రం కరువు!

ప్రాణహిత, వార్ధా నదుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పనిచేస్తే పరివాహక ప్రాంతాల రైతులకు సాగునీటి భరోసా లభించే అవకాశం ఉంది. అయితే పథకాలు పనిచేయక పోవడంతో రైతులు బోర్లు, వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో అనిశ్చితి పెరుగుతున్న తరుణంలో అందుబా టులో ఉన్న సాగునీటి వనరులను వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు.

 కథనాలు వచ్చినా.... చలనం లేదు ?

మండలంలోని ఎత్తిపోతల పథకాల దుస్థితిపై గతంలోనూ పత్రికల్లో కథనాలు వచ్చిన ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాయా? పథకాల వారీ గా మరమ్మతుల అంచనాలు రూపొందించాయా? రైతులకు సాగునీరు అందించేం దుకు కార్యాచరణ ఎప్పుడు అమలు చేస్తారు? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అధికారులు స్పందించాలి....

నిరుపయోగంగా ఉన్న నాలుగు ఎత్తిపోతల పథకాలపై సంబంధిత అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. పాడైన మోటార్లు, విద్యుత్ పరికరాలు, ఇతర సామగ్రి వివరాలను సేకరించి, చోరీ ఆరోపణలపై విచారణ చేపట్టాలని సూచిస్తున్నారు. మరమ్మతులకు అవసరమైన నిధులు కేటాయించి, పనుల గడువు, సాగునీటి సరఫరా పునఃప్రారంభంపై స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజాధనంతో నిర్మించిన పథకాలు రైతుల పొలాలకు నీరు అందించకపోతే వాటి ప్రయోజనం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి పథకాలు పనిచేయకపోవడానికి బాధ్యత ఎవరిది? చోరీ ఆరోపణలపై విచారణ ఎప్పుడు? రైతులకు సాగునీరు అందేది ఎప్పుడు? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

పథకాలను పునరుద్ధరించాలి 

వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి, పాడైన మోటార్లకు మరమ్మతులు చేయించి రైతుల పొలాలకు సాగునీరు అందించాలి.

ఎలకర్ సంతోష్,గోండాయిపేట్ సర్పంచ్

మరిన్ని వార్తలు