ఓడేడు మానేరు వాగులో విషాదం..

23-10-2026 | 04:16pm
  1. సూరయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి మృతి
  2. దసరా పండుగ వేళ విషాద ఘటన.. భార్య, మరదలిని కాపాడిన స్థానికులు

ముత్తారం, అక్టోబర్ 23 (విజయ క్రాంతి): దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి మానేరు వాగులో(Manair Stream) స్నానానికి దిగి మృత్యువాత పడిన విషాద ఘటన ముత్తారం మండలం ఓడేడు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన శనిగారపు జైపాల్ మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామంలోని అత్తగారింటికి భార్య, మరదలితో కలిసి కారులో వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గమధ్యలో ఓడేడు సమీపంలోని మానేరు వాగు వద్ద కాసేపు ఆగారు.

ఈ క్రమంలో వాగులో స్నానం చేసేందుకు దిగిన జైపాల్ లోతైన గుంతలో చిక్కుకుని నీట మునిగి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి జైపాల్ భార్య, మరదలిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

పండుగ వేళ కుటుంబంతో ఆనందంగా గడిపి తిరిగి వస్తున్న క్రమంలో జైపాల్ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు