కార్మికుడిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి

23-10-2026 | 04:19pm

ఈ నెల 26న ఇందిరా పార్క్ ధర్నాకు తరలిరావాలి: సీఐటీయూ

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్,అక్టోబర్ 23 విజయక్రాంతి: మండల పరిధిలోని లింగాయపల్లి గ్రామపంచాయతీ(Lingayapalli Gram Panchayat) మల్టీపర్పస్ వర్కర్ వజ్రయ్యపై దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వరదగాలన్న డిమాండ్ చేశారు.గండీడ్‌లో చలో హైదరాబాద్ పోస్టర్లను విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడారు.

వజ్రయ్యపై పది రోజుల క్రితం దాడి జరిగినా,మహమ్మదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.నిందితుడిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరారు. గ్రామపంచాయతీ, ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన, వీఓఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు, భవన నిర్మాణ కార్మికుల వేతనాలు పెంచడంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌, గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షుడు పెంటయ్యతో పాటు చెన్నయ్య, వేపూరి వెంకటేష్, ఎల్లమ్మ, నరసమ్మ, సాయప్ప తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు