సొంతిల్లు ఉన్నా.. పరాయి గూటిలోనే!

19-10-2026 | 05:15am
  1. వరద కాలువ విస్తరణ బాధితుల ఆవేదన
  2. ముందస్తు నోటీసులు, హద్దులు చూపలేదంటూ నిర్వాసితుల ఆరోపణ
  3. ఇళ్ల తొలగింపుల తర్వాత నిలిచిన పనులు
  4. అద్దె ఇళ్లలో పండుగలు.. పెరుగుతున్న ఆర్థిక భారం

కేసముద్రం, అక్టోబర్ 18 (విజయక్రాంతి): పండుగ వేళ సొంతింట్లో కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన వేళ.. అద్దె గూటిలో కాలం వెళ్లదీస్తున్న దుస్థితి కేసముద్రం పట్టణంలోని(Kesamudram town) వరద కాలువ విస్తరణ బాధితులది. కాలువ పనుల కోసం ఇళ్లు, ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు తొలగించినప్పటికీ నిర్మాణం ముందుకు సాగకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరిట తమ నివాసాలకు దూరమయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండుగ పూటా అద్దె ఇంట్లోనే..

దసరా, దీపావళి వేళ సొంత గడపలో పూజలు చేసుకోవాల్సిన కుటుంబాలు.. అద్దె ఇళ్లలో పండుగ జరుపుకోవాల్సి వస్తోందని వాపోతున్నాయి. కళ్లముందే కూల్చివేసిన ఇంటి జ్ఞాపకాలు ఒకవైపు, నెలనెలా అద్దె చెల్లించాల్సిన భారం మరోవైపు తమను కలచివేస్తున్నాయని పేర్కొంటున్నారు. కాలువ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి.

తొలగింపుల్లో వేగం.. పనుల్లో జాప్యం!

కాలువ విస్తరణలో భాగంగా కాల్వ మొదలయ్యే అమీనాపురం నుండి ఉప్పరపల్లి చెరువు శివారు వరకు మార్కింగ్ ఇవ్వలేదని చెబుతున్నారు. రైల్వే అండర్ డ్రైనేజీ నుండి ఉప్పరపల్లి రోడ్డు ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే ఓవైపు తొలగింపులు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలువకు ఓవైపు 22 అడుగులు రహదారి, మరోవైపు 12 అడుగులు రహదారికి వదలాల్సి ఉంటుందని చెప్పడం సమంజసం కాదంటున్నారు.

కాలువకు ఇరువైపులా ఒకే విధంగా విస్తరణ చేపట్టాలని, ఒకరికి ఓ విధంగా మరొకరికి ఇంకో విధంగా వ్యవహరించడం తగదు అంటున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, పరిహారం, కొలతలకు సంబంధించిన లెక్కలు స్పష్టంగా వెల్లడించకుండానే ఇళ్లను, ప్రహరీ గోడలను, మరుగుదొడ్లను తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలగింపుల అనంతరం నిర్మాణాన్ని కొనసాగించకపోవడంతో ఇటు నివాసం కోల్పోయి, అటు వరద నివారణ పనులు పూర్తికాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

అటు ఇల్లు లేదు.. ఇటు కాలువ పూర్తికాలేదు!

వరద ముప్పును తగ్గించేందుకు కాలువ విస్తరణ అవసరమే అయినా.. ఆ ప్రక్రియలో నష్టపోయిన కుటుంబాల పునరావాసం, పరిహారంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడంతోపాటు, తొలగింపులకు సంబంధించిన వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని బాధితులు కోరుతున్నారు. తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియక ఎదురుచూస్తున్నారు.

బాధితులకు భరోసా కల్పించాలి

సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి, కాలువ నిర్మాణం పూర్తిచేసేందుకు కార్యాచరణ ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు. అర్హులకు నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాస సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరద నివారణ ఎంత ముఖ్యమో, ఆ పనుల్లో ఇళ్లు కోల్పోయిన వారి జీవితాలకు భరోసా కల్పించడం కూడా అంతే అవసరం.

సొంతిల్లు ఉన్నా.. అద్దె ఇంట్లో ఉంటున్నాం..

కాలువ నిర్మాణం పేరుతో మా ఇంటి ప్రహరీ గోడ, మరుగుదొడ్డిని తొలగించడంతో పండుగను సొంతింట్లో జరుపుకోలేకపోతున్నాం. రోజువారీ హోటల్ నిర్వహించే నాకు, సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూల్చివేతల వల్ల నెలకు రూ.6,000 అద్దె చెల్లిస్తూ అద్దె ఇంట్లో జీవించాల్సి వస్తోంది. కుటుంబ పోషణ కష్టంగా ఉన్న నాకు 6000 రూపాయల ఇంటి అద్దె ఆర్థిక భారంగా మారింది. అధికారులు తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలి.

- పీ.సదానందం, నిర్వాసితుడు

మరిన్ని వార్తలు