వెంకటయ్య టీచర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం
మహమ్మదాబాద్ (విజయక్రాంతి): మండల పరిధిలోని గాదీర్యాల గ్రామంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఉపాధ్యాయుడు కొండమొల్ల వెంకటయ్య(Kondamolla Venkataiah) టీచర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గాదీర్యాల్ గ్రామ సర్పంచ్ మాణిక్యమ్మ, బోరు కృష్ణయ్య పిలుపునిచ్చారు.
సోమవారం కొండమొల్ల వెంకటయ్య జయంతి సందర్భంగా గాదీర్యాల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆయన సతీమణి కొండమొల్ల పద్మమ్మ, కుమారుడు భరత్ చంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెంకటయ్య టీచర్ ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారని కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాములు, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, అంజిలయ్య, అనంతయ్య, హనుమంతు, ఆంజనేయులు, ఉపాధ్యాయులు. రేణుక. అనిత. పార్వతి. రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.