వాహనాల టాప్‌పై ప్రమాదకర ప్రయాణం.. చలాన్లు
- ఓవర్‌లోడింగ్‌పై పోలీసుల తనిఖీలు.. నిబంధనలు పాటించాలి: ఎస్సై కాశీపురం రామకృష్ణ
నాగల్‌గిద్ద, అక్టోబర్ 5 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండల పరిధిలో ఆటోలు, టాటా మ్యాజిక్ తదితర వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు వాహనాల టాప్‌పై ప్రయాణికులను కూర్చోబెట్టి ప్రమాదకరంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు నిలిపివేసి చలాన్లు విధించారు. ఎస్సై కాశీపురం రామకృష్ణ(SI Kasipuram Ramakrishna) ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, ముఖ్యంగా వాహనాల పైభాగంలో కూర్చొని ప్రయాణించడం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో జరిగిన ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఏఎస్సై రవీందర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.