కాన్పు కోసం వెళ్లి.. కానరాని లోకాలకు

05-10-2026 | 11:23pm

- శిశువు మృతి తెలిసినా జాప్యం చేశారంటూ ఆరోపణలు

- ప్రతిభ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన

మంచిర్యాల క్రైమ్, అక్టోబర్ 5 : కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ రుచిత మృతి మంచిర్యాలలో కలకలం రేపింది. గర్భంలోని శిశువు మృతి చెందిన విషయం వైద్యులకు ముందే తెలిసినా సకాలంలో శస్త్రచికిత్స చేయకుండా నార్మల్ డెలివరీ కోసం వేచి చూశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరిస్థితి విషమించిన తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స అందించడంతో రుచిత ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ సోమవారం ప్రతిభ ఆసుపత్రి(Prathibha Hospital) ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన గుగ్గిళ్ల రుచిత (25) తొమ్మిది నెలలుగా ప్రతిభ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చామని మృతురాలి బంధువు సురేష్ పేర్కొన్నారు. గర్భంలోని శిశువు మృతి చెందిన విషయం వైద్యులకు తెలిసినా కుటుంబ సభ్యులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని ఆరోపించారు.

- నార్మల్ డెలివరీ కోసం వేచి చూసి...

శిశువు మృతి చెందిన తర్వాత కూడా నార్మల్ డెలివరీ కోసం వేచి చూశారని, రుచిత పరిస్థితి సీరియస్ అయిన తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స అందించారని బంధువులు ఆరోపించారు. సకాలంలో శస్త్రచికిత్స చేసి ఉంటే రుచిత ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రుచిత మృతికి బాధ్యులైన వైద్యులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు