మందమర్రి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
- వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
- మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి(Mandamarri) పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkatswamy) తెలిపారు. శుక్రవారం మందమర్రిలోని బి-1 క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak)తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు.
మందమర్రి ప్రాంతంలో సింగరేణి భూమి(Singareni Land)ని సేకరించి సుమారు వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. మందమర్రిలో రూ.7 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు, చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయిందని, వచ్చే ఏడాది మార్చిలోపు అనుమతులు పొంది పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని, సుమారు రూ.30 కోట్లతో తాగునీటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కొత్త మైన్ ఏర్పాటు, ఏటీసీ శిక్షణ కేంద్రం ద్వారా నైపుణ్య శిక్షణ, జర్మన్ భాషలో శిక్షణ అందించి విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... 68 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, డీసీసీ ప్రతినిధి రఘునాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.