మహిళ తన ముగ్గురు పిల్లలతో అదృశ్యం

06-11-2026 | 11:11pm

ఘట్ కేసర్, నవంబర్ 6 (విజయక్రాంతి) : ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో అదృష్టమైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  కొండాపూర్ గ్రామానికి(Kondapur Village) చెందిన బొంత సరిత (46)  కుమార్తె మమత (26) తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు తెలిపారు. మమతకు సుమారు 8 సంవత్సరాల క్రితం కామారెడ్డికి చెందిన కుంచపు పోచయ్యతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అయితే, గత ఐదు నెలల క్రితం భర్తతో ఏర్పడిన కుటుంబ విభేదాల కారణంగా మమత తన ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చి, అనంతరం తల్లి ఏర్పాటు చేసిన అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ క్రమంలో వివిధ ఇళ్లలో పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది.

ఈనెల 5వ తేదీన ఉదయం మమత ఇంటి పనులకు వెళ్లగా, మధ్యాహ్నం సుమారు 1గంట సమయంలో ఆమె వదిన రాజేశ్వరి ఇంటికి వెళ్లి చూడగా మమతతో పాటు ముగ్గురు పిల్లలు కృప శైత్య (6), జోహన్ వెస్లీ (4), జోసెఫ్ (3) కనిపించలేదు. అనంతరం కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.

మమత నివసిస్తున్న గదిలో పరిశీలించగా, తాను పిల్లలతో కలిసి వెళ్లిపోతున్నానని, పిల్లలను చదివించి చూసుకుంటానని, తన కోసం వెతకవద్దని రాసిన లేఖ లభించినట్లు తెలిపారు. అదృశ్యమైన మమత తల్లి సరిత ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

అదృశ్యమైన మహిళ,  ముగ్గురు చిన్నారుల ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా ఘట్కేసర్ పోలీసులను సంప్రదించి సమాచారం  8712662705 అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు