గుంతల రహదారిపై ప్రయాణం.. ప్రతిరోజూ నరకయాతనే!
ఆరు గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు..
ఎన్నికల వేళ హామీలు.. ఆ తర్వాత మౌనం!
కోటపల్లి,సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల(Kotapalli Mandal) కేంద్రం నుంచి పలు గ్రామాలకు (కోటపల్లి,సర్వాయిపేట్, ఎసన్వాయి, ఎడగట్ట, పిన్నారం, పారిపెల్లి)వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ఆరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఈ రహదారిపై ప్రయాణం నరకయాతనగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉండటంతో గ్రామాల ప్రజలు తమ పనుల కోసం నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. చిన్నపాటి వర్షానికే రహదారిపై బురద పేరుకుపోవడంతో పాటు గుంతలు ఏర్పడి ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు.
మరోవైపు, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ రహదారి సమస్యను ప్రస్తావిస్తూ హామీలు ఇచ్చే రాజకీయ నాయకులు.. ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు ఏ పార్టీకి చెందిన నాయకులు ముందుకు రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం గుర్తొచ్చే రహదారి.. ప్రజల కష్టాల్లో మాత్రం ఎందుకు కనిపించదు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ఆరు గ్రామాల ప్రజల నిత్య నరకయాతనకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు.