తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

20-09-2026 | 08:03am

నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గంటలకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 60 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, పలు పర్యవేక్షణ కేంద్రాల్లో అసలు వర్షమే లేదని నివేదికలు వచ్చాయి. రద్దీగా ఉండే గణేష్ ఉత్సవ ప్రాంతాల్లో జల్లుల కారణంగా ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, మణికొండ, రామంతాపూర్‌, ఖైరతాబాద్‌, మాసబ్‌ ట్యాంక్‌, నాంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, బార్కాస్, కాటేదాన్, శివరాంపల్లి, బుద్వేల్, చాంద్రాయణగుట్ట, మామిడిపల్లె, బాలాపూర్, బండ్లగూడ జాగీర్ సహా నగరంలోని దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం, నాగోల్ లో 63.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 59.5 మి.మీ, రాజేంద్రనగర్‌లో 44.3 మి.మీ, శివరాంపల్లిలో 44 మి.మీ, అత్తాపూర్‌లో 40.3 మి.మీ వర్షపాతం నమోదైంది. మధురానగర్‌లో 30.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, నాగోలులోని కంకన్‌పల్లి, రాక్ టౌన్ కాలనీలలో వరుసగా 28.8 మి.మీ, 28.3 మి.మీ వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు