చరిత్రకు ఊపిరిపోద్దాం.. కట్టడాలను సంరక్షిద్దాం!

27-09-2026 | 12:18pm

రాణిశంకరమ్మ చరిత్రకు నిలయమైన బురుజు వద్ద పర్యాటక దినోత్సవం

పాపన్నపేట,సెప్టెంబర్27: చారిత్రక కట్టడాలు మన సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలని, వాటిని కాపాడుకోవడం కేవలం అధికారుల బాధ్యతే కాదని, ప్రజలందరూ భాగస్వాములై సంరక్షించాల్సిన అవసరం ఉందని ఎంపీడీఓ విష్ణువర్ధన్(MPDO Vishnuvardhan), సర్పంచ్ పావని నరేందర్‌ గౌడ్(Sarpanch Pavani Narender Goud) పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేటలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాణిశంకరమ్మ చరిత్రకు నిలయంగా ఉన్న బురుజు వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి చారిత్రక కట్టడం, రాణిశంకరమ్మ పాలనా వైభవాన్ని గుర్తుచేసుకున్నారు.

రాణిశంకరమ్మ పాలనకు, ఆనాటి చారిత్రక ఘట్టాలకు సాక్ష్యాలుగా నిలిచిన కట్టడాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు పేర్కొన్నారు. కాలక్రమంలో చారిత్రక ఆనవాళ్లు శిథిలావస్థకు చేరకుండా వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్నపేట ప్రాంతంలో ఉన్న చారిత్రక ప్రదేశాలకు విస్తృత ప్రచారం కల్పించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తే స్థానిక ప్రాంతానికి మరింత గుర్తింపు లభిస్తుందన్నారు. యువత చారిత్రక వారసత్వంపై అవగాహన పెంచుకుని, కట్టడాల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నరేందర్ గౌడ్, ఉపసర్పంచ్ సద్దాం హుసేన్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి నయీమ్, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు