మహిళ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు.. వెంబడించి వేధింపులు
మేడిపల్లి పోలీసుల చర్యలు.. నలుగురు నిందితుల అరెస్ట్, కారు స్వాధీనం
మేడిపల్లి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మహిళ తన భర్తతో కలిసి వెళ్తుండగా కారులో వెంబడించి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, భయభ్రాంతులకు గురిచేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లిలోని సాయి ప్రియా కాలనీకి చెందిన 29 ఏళ్ల మహిళ, 18వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో తన భర్తతో కలిసి స్కూటీపై చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా, మార్గమధ్యంలో చెంగిచర్లలోని ఎస్వీడీ వైన్స్ వద్ద చికెన్ పకోడీ కొనుగోలు చేసేందుకు స్కూటీని ఆపారు.
అదే సమయంలో మద్యం సేవించి బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు ఆమెను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో, ఆమె వారిని మందలించారు. దీంతో సదరు వ్యక్తులు, ఆమె తన భర్తతో కలిసి తిరిగి ఇంటికి వెళ్తుండగా టీజీ 07 వై 1486 నంబరు గల కారులో వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేసినట్లు, బాధితురాలు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో కావటి ప్రణయ్ కౌశిక్, కోట వెంకట్, సిసలా రాజేష్, రాయుడు రాజకుమార్లను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నామని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని వెంబడించి వేధించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.