లివర్‌పూల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ప్రారంభం

19-10-2026 | 07:16pm

బెంగళూరు, అక్టోబరు 2026: లివర్‌పూల్‌ యూనివర్సిటీ(Liverpool University) తమ బెంగళూరు క్యాంపస్‌ను గురువారం అధికారికంగా ప్రారంభించింది. కర్ణాటకలో క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన తొలి రస్సెల్‌ గ్రూప్‌ విశ్వవిద్యాలయంగా నిలిచింది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ ప్రాంతం అలెంబిక్‌ సిటీలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. తొలి బ్యాచ్‌లో దాదాపు 300 మంది విద్యార్థులకు ఇక్కడ ప్రవేశాలు కల్పించారు. భారత్‌-యూకే ఉన్నత విద్యా రంగ సహకారంలో కీలక ఘట్టంగా నిలిచిన ఈ కార్యక్రమంలో కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.బి. పాటిల్‌, లివర్‌పూల్‌ సిటీ రీజియన్‌ మేయర్‌ స్టీవ్‌ రోథెరమ్‌, లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎల్‌ఎఫ్‌సీ) దిగ్గజం, లివర్‌పూల్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి రాబీ ఫౌలర్‌ పాల్గొన్నారు.

వీరితో పాటుగా ఈ వేడుకల్లో కర్ణాటకలో బ్రిటిష్‌ డిప్యూటీ కమిషనర్‌ హర్ష్‌బీర్‌ సంఘా ఎంబీఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ, బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఇండియా డైరెక్టర్‌ అలిసన్‌ బారెట్‌, విద్యా భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. లివర్‌పూల్‌ యూనివర్సిటీ బెంగళూరు క్యాంపస్‌ ప్రారంభోత్సవ వేడుకలు తొలి బ్యాచ్‌ విద్యార్థుల విద్యా ప్రయాణానికి నాంది పలికాయి. ఈ క్యాంపస్‌లో దాదాపు 300 మంది విద్యార్థులు తమ చదువులను ప్రారంభించారు.

తొలి దశలో కంప్యూటర్‌ సైన్స్‌, గేమ్‌ డిజైన్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, బయోమెడికల్‌ సైన్సెస్‌ కోర్సులను విశ్వవిద్యాలయం అందిస్తోంది.విద్యార్థులకు సౌకర్యవంతమైన, సమగ్ర అభ్యసన వాతావరణాన్ని అందించేలా క్యాంపస్‌ను రూపొందించారు. భవిష్యత్తులోని ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా పట్టభద్రులను సిద్ధం చేసేలా విశ్వవిద్యాలయ కోర్సులను రూపొందించారు. బెంగళూరు గ్రేటర్‌ అథారిటీ ప్రత్యేక కమిషనర్‌ శిల్పా నాగ్‌, లివర్‌పూల్‌ సిటీ రీజియన్‌ పెట్టుబడులు, ప్రాజెక్టుల అమలు విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టిమ్‌ గేమ్స్‌ ఇరు ప్రాంతాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించాలన్న ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉమ్మడి ఉద్దేశ ప్రకటనపై సంతకాలు చేశారు.

భారత్‌-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనంతరం వృద్ధికి ఉన్న అవకాశాలపై ఆర్థిక రంగ చర్చా కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ మాట్లాడుతూ... “ లివర్‌పూల్ విశ్వవిద్యాలయం బెంగళూరు క్యాంపస్, విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధన, అభ్యాస అనుభవాన్ని అందిస్తూ, అభివృద్ధి చెందుతున్న మన జ్ఞాన, ఆవిష్కరణల వ్యవస్థకు ఒక అద్భుతమైన జోడింపు.

ఈ క్యాంపస్‌ నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులు తమ వృత్తి జీవితాల్లో ఉన్నత విజయాలు సాధిస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు” అని పేర్కొన్నారు. లివర్‌పూల్‌ సిటీ రీజియన్‌ మేయర్‌ స్టీవ్‌ రోథెరమ్‌ మాట్లాడుతూ... “భారతదేశం గొప్ప ఆశయాలు కలిగిన దేశం. మనం మరింత సన్నిహితంగా కలిసి పనిచేయడం ద్వారా ఎంతో సాధించవచ్చు. పరిశోధన, ఆవిష్కరణల నుండి వాణిజ్యం, పెట్టుబడుల వరకు, మన దేశాల్లోని ప్రజలకు, వ్యాపార సంస్థలకు నిజమైన ప్రయోజనాలను చేకూర్చేలా సంబంధాలను నిర్మించాలని నేను కోరుకుంటున్నాను” అని వివరించారు.

మరిన్ని వార్తలు