మట్టి వినాయకులను ప్రతిష్టించి-భక్తితో పూజిద్దాం ప్రకృతిని కాపాడుదాం

12-09-2026 | 12:03am

మట్టి వినాయకుడే పర్యావరణానికి శ్రీరామరక్ష

ఘట్ కేసర్,(విజయక్రాంతి): వినాయక చవితి(Vinayaka Chavithi) సందర్భంగా పర్యావరణ పరిరక్షణ(Environmental protection)కు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు స్వస్తి పలికి మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని మాజీ కౌన్సిలర్ బేతాల నర్సింగ్‌రావు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఘట్కేసర్ డివిజన్ ఈడబ్ల్యుఎస్ కాలనీ బస్‌స్టాప్ సమీపంలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరి ఆధ్వర్యంలో శుక్రవారం  కొండాపూర్‌ విజ్ఞాన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు స్వయంగా తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను(clay ganesha idols) ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగల పేరుతో పర్యావరణాన్ని కలుషితం చేయకుండా సంప్రదాయాలను ప్రకృతికి అనుకూలంగా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

మట్టి వినాయక ప్రతిమల వినియోగంతో నీటి వనరుల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. భక్తి మనసులో ఉండాలి పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత కావాలి అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కుంటోళ్ల యాదగిరి తెలిపారు. విద్యార్థులు స్వయంగా మట్టి ప్రతిమలను తయారు చేసి ప్రజలకు ఉచితంగా అందించడం ద్వారా పర్యావరణహిత వినాయక చవితిపై చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు శశిధరన్, కంధి లింగం, భూషణం, కె. రాజేందర్ రెడ్డి, కిరణ్, బాలకృష్ణ, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ లు ప్రవళిక, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు