ఉద్యాన పరిశోధనలకు శ్రీబయోతో కీలక ఒప్పందం
- జీవ సాంకేతికతతో తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడే లక్ష్యం
- శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దండ రాజిరెడ్డి
గజ్వేల్: ఉద్యాన పంటల్లో స్థిరమైన, పర్యావరణహిత సాగు విధానాలను ప్రోత్సహించేందుకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం(Sri Konda Lakshman Telangana Horticultural University), శ్రీ బయోఎస్తటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Shree BioAesthetics Private Limited)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జీవ ఆధారిత సాగు, నేల–మొక్కల సూక్ష్మజీవ వ్యవస్థ, రైజోస్ఫియర్ నిర్వహణ, జీవ ఆధారిత పంట రక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునే పంటల అభివృద్ధిపై సంయుక్త పరిశోధనలు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఉపకులపతి డా. దండ రాజిరెడ్డి మాట్లాడుతూ స్వీట్ ఆరెంజ్, ఆయిల్‌పామ్, కూరగాయలు, మామిడి, మిరప తదితర ఉద్యాన పంటల్లో జీవ ఆధారిత సాంకేతికతలపై విస్తృత పరిశోధనలు అవసరమన్నారు. రైతులు ఎరువులు, పురుగుమందులను అవసరానికి మించి వినియోగించకుండా తక్కువ రసాయనాలతో అధిక నాణ్యత, మెరుగైన దిగుబడులు సాధించే విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
నర్సరీల్లో ఆరోగ్యకరమైన నాట్ల అభివృద్ధి, ఆయిల్‌పామ్‌లో గానోడెర్మా, మిరపలో బ్లాక్ త్రిప్స్ నియంత్రణ, కరువు–వేడి– లవణీయతను తట్టుకునే పంటల అభివృద్ధి, అధిక సాంద్రత మామిడి సాగు, రైజోస్ఫియర్ పునరుజ్జీవనంపై పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఏ. భగవాన్, శ్రీబయోఎస్తటిక్స్ డా. కె.ఆర్.కె. రెడ్డి, అధికారులు, శాస్త్రవేత్తలు, బోధన సిబ్బంది పాల్గొన్నారు.