మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి..

26-10-2026 | 05:10pm

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు..

ములుగు అక్టోబర్ 26 (విజయక్రాంతి): మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సత్యం, ధర్మం, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు(District Collector Borkhade Hemant Sahadev Rao) అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి జిల్లా కలెక్టర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణ మహాకావ్యం ద్వారా సత్యం, ధర్మం, మానవీయ విలువలను చాటిన మహనీయుడు వాల్మీకి అని పేర్కొన్నారు. ఆదికవిగా భారతీయ సాహిత్యంలో విశిష్ట స్థానం పొందారని తెలిపారు. రామాయణంలో వివరించిన కుటుంబ బంధాలు, బాధ్యతలు, నైతిక విలువలు నేటి సమాజానికి మార్గదర్శకమని అన్నారు. యువత మహనీయుల జీవితాలను అధ్యయనం చేసి, వారి ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్ జి, సంపత్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి రవి కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రామ్మోహన్, వాల్మీకి కుల సంఘం సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు