ఎల్టీఆర్ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి

13-10-2026 | 11:40pm

1/70 చట్టానికి విరుద్ధంగా జారీ చేసిన ఇంటి పన్ను రసీదులు రద్దు చేయాలి

వెంకటాపురం, నూగూరు అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలో ఎల్టీఆర్, 1/70 చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్(Gondwana Welfare Parishad), తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో చట్టాలకు విరుద్ధంగా వలస గిరిజనేతరులకు జారీ చేసిన ఇంటి పన్ను రసీదులను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా జీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కణితి వెంకటకృష్ణ మాట్లాడుతూ... ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను అరికట్టాలని కోరారు. వలసలను నిరోధించాల్సిన అధికారులు గిరిజనేతరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పటిష్టంగా అమలు చేసి, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.

మండలంలో 20 ఏళ్లుగా నివసిస్తున్న ఓ ఆదివాసీ కుటుంబానికి ఇంటి పన్ను విషయంలో ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఆరు నెలలుగా విద్యుత్ సౌకర్యం లేకున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులు, భూములకు రక్షణ కల్పించి, అక్రమ ఇంటి పన్ను రసీదులను రద్దు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు