రీ-లొకేషన్ వద్దు.. మా గ్రామమే ముద్దు!

13-10-2026 | 03:59pm

అటవీ శాఖ తీరుపై వటువర్లపల్లి గ్రామస్తుల నిరసన.

అచ్చంపేట అక్టోబర్ 13: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామ(Vatuvarlapally Villagers) అభివృద్ధిని రీ-లొకేషన్ పేరుతో అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు మంగళవారం హైదరాబాద్‌–శ్రీశైలం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, కంకరను తీసుకురాకుండా అడ్డుకుంటున్నారని, ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేశారని ఆరోపించారు. వాటర్ ట్యాంక్, ఆశ్రమ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు కూడా అటవీ శాఖ అధికారులు ఆటంకాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

రీ-లొకేషన్ పేరుతో గ్రామస్తులను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. “రీ-లొకేషన్ వద్దు.. మా గ్రామమే ముద్దు.. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే జీవిస్తాం” అంటూ నినాదాలు చేశారు.

ఈ నిరసనలో మాజీ సర్పంచులు చత్రు నాయక్, సర్య నాయక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు