ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
కల్వకుర్తి: విశ్వ సృష్టికి శిల్పి, సకల కళలకు ఆద్యుడు, దేవతల దివ్య నిర్మాణాలకు రూపకర్తగా భావించే విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను కల్వకుర్తి(Kalvakurthi)లో విశ్వబ్రాహ్మణులు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక బ్రహ్మంగారి ఆలయం(Brahmagari Temple)లో విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ యజ్ఞం, పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
విశ్వకర్మ జయంతి వేడుకలకు(Vishwakarma Jayanti celebrations) విశ్వబ్రాహ్మణులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పట్టణ పురవీధుల్లో నిర్వహించిన విశ్వకర్మ భగవానుడి శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు మాట్లాడుతూ.. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అనే పంచదాయిల సమ్మేళనమే విశ్వకర్మ భగవానుడని తెలిపారు. సకల శిల్పకళలకు, నిర్మాణ నైపుణ్యాలకు విశ్వకర్మ భగవానుడు మూలాధారమని పేర్కొన్నారు. విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.