గొత్తికోయ ఆవాసంలో వైద్య శిబిరం

17-09-2026 | 10:15pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని చాకిరేవులు గొత్తికోయ ఆవాసంలో గురువారం పీహెచ్‌సీ వైద్యాధికారి డా.చీర్ల శ్రీకాంత్ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ పల్లె దవాఖాన వైద్యాధికారి డా.చందన ఆధ్వర్యంలో వైద్య శిబిరం(Medical camp) నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిలు 10 కిలోమీటర్ల మేరకు ట్రాక్టర్‌ పై వెళ్లి అనంతరం కాలినడకన ఆవాసానికి చేరుకుని వైద్య సేవలు అందించారు. 52 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక పరీక్షలు చేసి ఆరోగ్య సూచనలు అందించారు.

జ్వర లక్షణాలున్న వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేసి నిర్దారించి వారికి మందులు అందించి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ నివారణకు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమతెరలు వినియోగించాలని వైద్య సిబ్బంది సూచించారు. జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని ఆశ్రయించాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు శోభ, సుశీల, మోతీలాల్, ఆశా కార్యకర్తలు మాధవి, కవిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు