ఆగం చేసిన అర్నబ్

29-10-2026 | 05:45am
  1. ఏపీ, ఒడిశాలో తుఫాన్ బీభత్సం
  2. ఏపీలోని 13 జిల్లాల్లో ఆకస్మిక వరదల హెచ్చరిక
  3. తెలంగాణలో సైక్లోన్ ప్రభావం.. రోజంతా చల్లని గాలులు
  4. తొలుత నర్సాపురంలో తీరాన్ని తాకిన తుఫాన్
  5. గంటగంటకూ కొత్తదిశలో పయనిస్తూ... యానంకు నైరుతి దిశలో తీరం దాటిన సైక్లోన్
  6. 125- నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
  7. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
  8. ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం
  9. దెబ్బతిన్న రోడ్లు, నేలకూలిన చెట్లు.. ఏడుగురు మృతి

అమరావతి/భువనేశ్వర్, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో ‘అర్నబ్’ తుఫాన్(Arnab Cyclone) బీభత్సం సృష్టించింది. సముద్రం అల్లకల్లోలంగా మారి, ఉవ్వెత్తున అలలు ఎగిసిపడి తీరప్రాంతాలను విధ్వంసం చేసింది. ఈ అత్యంత తీవ్రమైన తుఫాన్ బుధవారం తెల్లవారుజాము 2 గంటలకు నర్సాపురం, అమలాపురం మధ్య తీరాన్ని తాకే ప్రక్రియ మొదలైంది. తర్వాత తన దిశను గంటగంటకూ మార్చుకుని ఉదయం 8 గంటలకు కాకినాడకు సమీపంలో, యానంకు నైరుతి దిశలో తీరం పూర్తిగా దాటింది.

ఈ సమయంలో గాలి గంటకు 125- కిలో మీటర్ల వేగంతో, గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఉదయం 8 గంటల వరకు తీరాన్ని పూర్తిగా దాటిందని, ఆ తర్వాత తీవ్ర తుఫాన్‌గా బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో తీర ప్రాంత జిల్లాల్లో ప్రచండగాలులు వీచా యి. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షా లు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా, రోడ్లు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో అర్నబ్ తుఫా న్ భారీ నష్టాన్ని మిగిల్చింది. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా జరిగిన వేర్వేరు ప్రమా దాల్లో ఏడుగురు మరణించారు.

కోనసీమలో సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రపు కోతకు బీచ్ రోడ్డు దెబ్బతినగా.. సుమారు 30 ఇళ్లు కూలిపో యాయి. అయితే తెలంగాణలో మాత్రం బుధవారం అర్నబ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ రాష్ట్రవ్యాప్తంగా చల్లని గాలలు వీయడం, మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. 

అత్యంత భారీ వర్షాలు

అర్నబ్ తీవ్ర తుఫాన్ వల్ల బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షపాతం, ఒడిశాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఏపీలోని గరివిడిలో 26 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో అనకాపల్లి, శృంగవరపుకోట, వేపాడ, చీపురుపల్లి ఉన్నాయి. మచిలీపట్నంలో గరిష్టంగా గంటకు 96 కి.మీ వేగంతో గాలులు వీచాయి.

విశాఖపట్నం, కాకినాడలో గంటకు 80 కి.మీ, కళింగపట్నంలో 70 కి.మీ, బాపట్లలో 45 కి.మీ, కావలిలో 32 కి.మీ వేగంతో గాలులు వీచాయి. కోస్తా జిల్లాల్లోని ప్రధాన పంటలైన వరి, కోనసీమ కొబ్బరి, గోదావరి లంకల్లో అరటి, ఆక్వా సాగుపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, తీవ్ర గాలులు, వరద ముంపుతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే ఒడిశాలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించామని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి తెలిపారు.

ఈ తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 48 గంటల్లో ఈ తుఫాన్ ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ తెలిపింది. ఇది ఆరు గంటల్లో ‘సైక్లోనిక్ స్టార్మ్’ (తుఫాన్)గా, ఆ తర్వాత మరో ఆరు గంటల్లో ‘డీప్ డిప్రెషన్’ (తీవ్ర అల్పపీడనం)గా బలహీనపడే అవకాశం ఉంది. నవంబర్ 3 వరకు మొత్తం ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఏడుగురు మృతి

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలోని పాత గోశాల సమీపంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. సింహాచలం బాలాజీనగర్ ప్రాంతంలోనూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చెట్టు విరిగిపడి చొక్కా కిశోర్ (45), బొండాడవారి వీధిలో విద్యుత్ స్తంభం కూలి రాంబాబు(34) మృతి చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇద్దరు వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లాలో విద్యుత్ షాక్‌కు గురై ఓ మహిళ మరణించింది.

13 జిల్లాల్లో వరదల హెచ్చరిక

‘అర్నబ్’ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ని 13 జిల్లాల్లో, యానంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తుఫాన్ హెచ్చరిక కేంద్రం బుధవారం హెచ్చరించింది. ఈ హెచ్చరిక గురువారం ఉదయం 5.30 గంటల వరకు అమల్లో ఉంటుంది. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, మన్యం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. 

తెలంగాణలో సైక్లోన్ ప్రభావం

అర్నబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై పడింది. హైదరాబాద్, దాని సమీప జిల్లాల్లో బుధవారం రోజంతా చల్లని గాలులు వీచాయి. ఆకాశం మేఘావృతమైంది. దీంతో వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా మారిపో యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో రాత్రిపూట 19.2 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 18.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 31 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గురువారం మధ్య చురుకుగా ఉండే తీవ్ర తుఫాను వ్యవస్థ ప్రభావంపై హైదరాబాద్ ఐఎండీ బులెటిన్ విడుదల చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌తో సహా తెలంగాణ తూర్పు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు తీవ్రమైన కుండపోత వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 

మరిన్ని వార్తలు