ఆకలి మంటలు
- ఫ్రాన్స్‌లో రోడ్డెక్కిన లక్షల మంది
- ధరలు పెరగడం, జీతాలు తగ్గడంపై ఆగ్రహం
- ఆర్థిక ఇబ్బందులు తాళలేక వీధుల్లోకి..!
- పారిస్, లిమోజెస్, బోర్డియక్స్ నగరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు
- 143 ఏండ్ల చారిత్రక టౌన్ హాల్‌కు నిప్పు
- స్టోర్స్ నుంచి నిత్యావసర సరుకులు లూటీ
- పోలీసులపై రాళ్లతో దాడి.. దుకాణాలు, వాహనాలు ధ్వంసం
పారిస్, అక్టోబర్ 18: ఫ్రాన్స్‌లో ఆకలి మంటలు రాజుకుంటున్నాయి. లక్షల మంది రోడ్ల మీదికి వచ్చి నిరసనలు(Protests) తెలుపుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, తగ్గుతు న్న జీతాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆందోళన బాటపట్టారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ నిరసనలు తాజాగా మరింత తీవ్రమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలైన పారిస్, లిమోజెస్, బోర్డియక్స్, లిల్లే ప్రాంతాల్లో భారీగా నిరసనకారులు రోడ్ల మీదికి వచ్చి..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది తమ కడుపు మంట అని, ఆకలి కేకలు అంటూ రగిలిపోయారు. స్టోర్స్, మాల్స్‌లోకి దూసుకెళ్లి.. విలువైన వస్తువులను, ఆహార ధాన్యాలను ఎత్తుకెళ్లారు. వాహనాలకు, చారిత్రక కట్టడాలకు నిప్పు పెట్టారు. దేశవ్యాప్తంగా వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్‌లోని స్కూళ్లలో సరైన వసతులు లేవని, టీచర్ల భర్తీ లేదని ఇటీవల విద్యార్థులు రోడ్లమీదికి వచ్చారు.
వారికి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు మద్దతుగా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ ఉద్యమం ఇప్పుడు దేశంలోని ఆర్థిక ఇబ్బందుల వైపు మళ్లింది. పెరుగుతున్న నిత్యావసర ధరల వల్ల పస్తులు ఉండాల్సి వస్తున్నదని, పైగా వచ్చే జీతాలు కూడా అరకొరగా ఉంటున్నాయని, ఇంటి రెంట్లు కూడా తడిసిమోపెడవుతున్నాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మ్యాక్రాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
మంటల్లో చారిత్రక కట్టడాలు..
శనివారం మధ్యాహ్నం పారిస్, లిమోజెస్, బోర్డియక్స్, లిల్లే, రన్నెస్, మార్సెయి నగరాల్లో జనం రోడ్లమీదికి వచ్చి శాంతియుత ర్యాలీ చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. లూటీలకు తెగబడ్డారు. రాత్రి అంతా ఆ పరిసరాలన్నీ మంటల్లో కనిపించాయి. చాలా మంది నిరసనకారులు చారిత్రక కట్టడాల మీదికి ఎక్కి ఫొటోలు దిగడం, వాటికి నిప్పుపెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
లిమోజెస్ నగరంలోని 143 ఏండ్ల నాటి టౌన్ హాల్ మంటల్లో కాలిపోయింది. భవనం పైకప్పు పూర్తిగా కూలిపోయింది. లిల్లే నగరంలోని యాపిల్ వంటి స్టోర్స్‌లోకి నిరసనకారులు వెళ్లి.. వస్తువులను ఎత్తుకెళ్లారు. దుకాణాల్లో నుంచి నిత్యావసర సరుకులు కూడా పట్టుకెళ్లారు. ఆదివారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా నగరాల్లో పోలీసులు మోహరించి.. నిరసనకారులపైకి బాష్ప వాయువును ప్రయోగించారు.
అయినా.. జనం వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం దిగివచ్చి.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేశారు. దేశమంతా ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే పాలకులు మాత్రం భోగాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
రోడ్లమీదికి ఐదున్నర లక్షల మంది..
ఒక్క పారిస్ నగరంలోనే శనివారం సాయంత్రం లక్ష పదివేల మందికిపైగా జనం రోడ్లమీదికి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ పోలీసు వాహనాలపైకి నిరసనకారులు పెద్ద ఎత్తున రాళ్లు విసిరారు. వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులు తీయాల్సివచ్చింది. దేశ వ్యాప్తంగా 5.5 లక్షల మంది నిరసనల్లో పా ల్గొన్నారని ప్రభుత్వం వెల్లడించింది. వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణల్లో పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఐరోపా అంతటా..!
ఫ్రాన్స్‌లోనే కాదు ఐరోపా అంతటా జనం రోడ్లమీదికి వస్తున్నారు. అల్బేనియా, బెల్జియం, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, ఐర్లాండ్, పోర్చుగల్, బ్రిటన్, జర్మనీ, హంగేరీ వంటి యూరప్ దేశాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు, జీతాల్లో వ్యత్యాసాలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బం దులు జనాన్ని రోడ్డెక్కేలా చేస్తున్నాయి.
బాధ్యులపై చర్యలు తప్పవు: మ్యాక్రాన్
కావాలని కొందరు రెచ్చగొడుతూ విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయె ల్ మ్యాక్రాన్ మండిపడ్డారు. లూ టీలు, దహనాలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత నిర సనలకు తాము ఎప్పుడూ అడ్డుచెప్పలేదని, అశాంతిని రగల్చివారిపై మాత్రం చూస్తూ ఊరుకోబోమని అన్నారు. వచ్చే ఏడాది దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయని, ఈ నేపథ్యంలో కొందరు కావాలనే శాంతిభద్రతలను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
ట్రంప్ సెటైర్లు..
ఫ్రాన్స్‌లో నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు వేశారు. ‘సుందర దేశం ఫ్రాన్స్‌లో ఎప్పు డూ నిరసనలు ఉండవు. లూటీలనేవి అసలే జరగవు. మన ం కూడా అక్కడికి వెళ్లి హాయిగా ఉందాం. అతి తక్కువ ఖర్చుతో మనం అక్కడికి వెళ్లొచ్చు’ అంటూ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ఆయన కామెంట్లు చేశారు.
కాగా, ఫ్రాన్స్ లో అల్లర్లకు వలసదారులే కారణమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. మానవత్వం పేరి ట వలసలను ప్రోత్సహి ంచడంతోనే పరిస్థితి ఇలా తయారైందని ఆయన అన్నారు.