భారత పైలట్ ధైర్యానికి మోదీ ఫిదా!
“పైలట్‌ను పొడిచారు.. విమానం అమాంతం కిందికి! ఆ తర్వాత ఏం జరిగిందంటే?”
“ఒక్క తలుపు.. 174 ప్రాణాలు!”
కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఒక హీరో
న్యూఢిల్లీ: విమానం గాల్లో ఉంది.. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా కత్తి దాడి.. పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయినా ఆ భారత పైలట్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి కీలక సమయంలో తీసుకున్న నిర్ణయం విమానంలోని 174 మంది ప్రాణాలను కాపాడటంలో కీలకంగా మారింది. ఇప్పుడు ఆయన ధైర్యానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కాక్‌పిట్‌లో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్(Indian Pilot Smit Machchhar) కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డారు.
విమానం ఒక్కసారిగా భారీగా ఎత్తు కోల్పోవడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. అనంతరం విమానంలో ఉన్న ఇతర పైలట్లు నియంత్రణ చేపట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. మచ్చార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్థిరమైన పరిస్థితిలో ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మోదీ ప్రశంసలు..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను “హీరో”గా(Smit Machchhar Hero) అభివర్ణించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు ఆయన చూపిన ధైర్యం, పట్టుదల గొప్పవని మోదీ పేర్కొన్నారు. ఆయన సాహసం పెను విషాదాన్ని తప్పించడంలో సహాయపడిందని, భారత్ ఆయన పట్ల గర్వంగా ఉందని తెలిపారు. మచ్చార్ త్వరగా కోలుకోవాలని కూడా మోదీ ఆకాంక్షించారు.
అంతర్జాతీయంగా ప్రశంసలు..
మచ్చార్ ధైర్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) కూడా ప్రశంసించారు. మరోవైపు నెతన్యాహు కూడా ఆయనను నిజమైన హీరోగా పేర్కొన్నారు. అయితే ఘటనకు సంబంధించిన కొన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నందున పూర్తి కారణాలు, ఉద్దేశం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఒకవైపు ప్రాణాపాయ పరిస్థితి.. మరోవైపు వందల మంది ప్రయాణికుల భద్రత.. అలాంటి సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనకు గాయాలైనా.. ప్రయాణికుల భద్రతను ముందుపెట్టి పోరాడిన భారత పైలట్‌కు మోదీ ప్రశంసలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.