అథ్లెట్లకు సీఎం భారీ నజరానా
చెన్నై: ఏషియన్ గేమ్స్‌లో సత్తా చాటిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు రజత పతకం అందించిన జట్టులో చోటు దక్కించుకున్న విద్య రామరాజ్, విశాల్‌కు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. భారత మిక్స్‌డ్ రిలే బృందంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అథ్లెట్లు రాణించడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. వారి ప్రతిభను గుర్తిస్తూ ఈ నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తమిళనాడు సీఎంఓ వెల్లడించింది.
SDATకు చెందిన ‘ఎలైట్ స్పోర్ట్స్‌పర్సన్ స్కీమ్’ ద్వారా వీరికి ఆర్థిక సహాయం అందనుంది. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో విద్య రామరాజ్, విశాల్‌తో పాటు మను, పూవమ్మ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. భారత్ 3:14.46 టైమింగ్‌తో రేసును పూర్తి చేసి రజతాన్ని సొంతం చేసుకుంది. బహ్రెయిన్ 3:12.87తో గేమ్స్ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ ఈవెంట్‌లో భారత్‌కు ఇది వరుసగా మూడో ఆసియా క్రీడల పతకం.
2018లో ఈ విభాగం తొలిసారి ఏషియన్ గేమ్స్‌లో ప్రవేశించగా భారత్ స్వర్ణం సాధించింది. 2022లో రజతం గెలిచిన భారత జట్టు.. తాజా పోటీల్లోనూ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉండగా, ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టుకు స్వర్ణం అందించడంలో భాగమైన తమిళనాడు యువ క్రికెటర్ జి. కమలినికి కూడా సీఎం విజయ్ గతంలో రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.