విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- పెద్దపల్లి నియోజకవర్గానికి మరో నాలుగు నూతన సబ్స్టేషన్లు
- రూ.13.51 కోట్లతో నిర్మాణాలు.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
- రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
పెద్దపల్లి, సెప్టెంబర్ 23(విజయ క్రాంతి) నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో నాలుగు నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (MLA Chintakunta Vijaya Ramana Rao)తెలిపారు. మొత్తం రూ.13 కోట్ల 51 లక్షల 59 వేల వ్యయంతో ఈ ఉపకేంద్రాలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని రైతులు, ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నామని విజయరమణారావు తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాజుపల్లిలో రూ.2.44 కోట్లతో, సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శాస్త్రినగర్లో రూ.2.47 కోట్లతో, ఓదెల మండలం రూప్నారాయణపేటలో రూ.4.14 కోట్లతో, ఎలిగేడు మండలం ధూళికట్టలో రూ.4.44 కోట్లతో నూతన విద్యుత్ ఉపకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఈ ఉపకేంద్రాలు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం మరింత పెరగడంతో పాటు రైతులకు సాగునీటి అవసరాలకు, గృహ, వాణిజ్య అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చూడాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రానున్న వేసవి కాలం నాటికి ఈ ఉపకేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని విజయరమణారావు వెల్లడించారు. విద్యుత్ ఉపకేంద్రాల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.