ఎయిడ్స్‌పై కళాబృందంచే అవగాహన
వెంకటాపూర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(Telangana State AIDS Control Society) ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, దిశ సంస్థల సహకారంతో కళా రంజని కళాబృందం ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపేట గ్రామంలోని వారాంతపు సంతలో మంగళవారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాబృందం సభ్యులు పాటలు, పల్లెసుద్దులు, నాటకాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
రక్షణ లేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి, కలుషిత సూదులు, హెచ్‌ఐవీ ఉన్న తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించే అవకాశాలపై వివరించారు. హెచ్‌ఐవీ సాధారణంగా తాకడం, కలిసి ఉండటం ద్వారా వ్యాప్తి చెందదని తెలిపారు. గర్భిణులు తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని, తల్లికి హెచ్‌ఐవీ ఉన్నప్పటికీ వైద్యుల సూచనలతో మందులు తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డను రక్షించవచ్చని సూచించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష చూపకుండా ప్రేమ, ఆప్యాయతలు చూపాలని కోరారు. ఉచిత హెల్ప్‌లైన్ 1097పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దిశ డీపీఎం జ్యోతి, వైఆర్‌జీ కేర్ డీఆర్‌పీ ముస్తాక్, సూపర్‌వైజర్ సరిత, లింక్ వర్కర్లు స్వప్న, సుమలతతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.