హక్కుల సాధనలో ఏఐటీయూసీదే అగ్రస్థానం
కార్మిక చట్టాలను కోడ్'లుగా మార్చడం దుర్మార్గం
ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ కే సాబీర్ పాషా
కొత్తగూడెం టౌన్ (విజయక్రాంతి): కార్మిక హక్కుల పరిరక్షణ, సమస్యల సాధనలో ఏఐటీయూసీ ఎల్లప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తుందని ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ కే సాబీర్ పాషా(AITUC District Honorary President SK Sabir Pasha) స్పష్టం చేశారు. సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని సివిల్ విభాగం రైటర్ బస్తీకి చెందిన కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ఏఐటీయూసీలో చేరారు.
ఈ సందర్భంగా కార్మికులకు ఎర్ర కండువాలు కప్పి యూనియన్ లోకి సాదరంగా ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ అదానీ, అంబానీ లాంటి కుబేరులకు అనుకూలంగా లేబర్ కోడ్ లుగా మార్పు చేయడం దుర్మార్గమన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధిలో పర్మనెంటు కార్మికులతో సమానంగా శ్రమిస్తున్న కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించాలని, వారికి రాబోయే దీపావళి లాభాల బోనస్ (పీఎల్ఆర్) పెంచి చెల్లించడంతోపాటు పర్మనెంటు కార్మికులకు చెల్లిస్తున్నట్లుగా దసరా అడ్వాన్సు చెల్లించాలని డిమాండ్ చేశారు.
వేతనాల పెంపుదల, ఉద్యోగ భద్రత కోసం వర్గ పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందని, కాంట్రాక్టు కార్మికులు సంఘటితంగా ఐక్యంగా పోరాడినప్పుడే న్యాయమైన సమస్యలు పరిష్కారం అవుతాయని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ వి రమణమూర్తి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కిష్టాఫర్, నాయకులు బంగారు లక్ష్మణ్, వి.నాగలక్ష్మి, శ్రీనివాస్, సుధాకర్, జె.భాగ్యలక్ష్మి, ఎం.శాంత, రమణ, సారమ్మ, అనంతలక్ష్మి, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.