గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

22-09-2026 | 08:05pm

యాదగిరి సునీల్ రావు

ముకరంపుర, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) తెలిపారు. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ఈసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మార్గదర్శకత్వంలో గతం కంటే భిన్నంగా నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రూ. కోటిన్నరకు పైగా నిధులు కేటాయించి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

నిమజ్జన ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బలమైన బారికేడింగ్ నిర్మించామని, అదనపు క్రేన్లు, తగినంత సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. నిమజ్జనోత్సవం ముగిసే వరకు మేయర్, కమిషనర్, తాము మరియు పాలకవర్గ సభ్యులంతా ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో, ఉత్సాహంగా పాల్గొని గణేష్ నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు