ఈశ్వర స్పర్శ
ప్రపంచభావనతో మనస్సు పూర్తిగా ముడిపడినప్పుడు, ప్రపంచమే సత్యమన్న ఆలోచన బలపడినప్పుడు, ఈ కనబడుతున్న జగత్తుకు మూలమేమిటన్న ప్రశ్న మనకు తప్పక కలుగుతుంది. కొంత ఆలోచించిన మీదట, ‘జ’ అంటే పుట్టేది, ‘గత్’ అంటే పోయేది అని అర్థమౌతుంది. ఋతువు ప్రకృతిని రూపాంతరీకరణం చేస్తున్నప్పుడు, అన్ని వేళలా మార్పుకు లోనైయ్యేది జగత్తు అన్న సమాధానం దొరుకుతుంది. కానీ జగత్తు వెనుక ఏమున్నదో మాత్రం తెలియదు. ఆ క్షణమే సత్యాన్వేషణ ప్రారంభమౌతుంది. అయితే కేవలం పదార్థ విజ్ఞానంతోనే ఇది సాధ్యం కాదు.
బ్రహ్మము ఎవరు? ఆత్మ అంటే ఏమిటి? ఈ జగత్తుకు మూలము బ్రహ్మమైతే, దాని స్వరూప స్వభావాలు ఎట్లా ఉంటాయన్న ప్రశ్నలు మొదలై, కంటికి కనిపించని పూర్ణత్వమే బ్రహ్మమని, కనిపిస్తున్న పూర్ణత్వం లోకమని, బ్రహ్మంలో నుండే లోకం పుట్టింది కనుక ఉన్నదంతా బ్రహ్మమే అన్న అనుభవం స్థిరమౌతుంది.
దేనిని ఈ కనులు చూడలేవో, కానీ దేని వలన ఈ కనులు చూడగలుగుతున్నవో అదే బ్రహ్మం. కనుక పదార్థం సైతం బ్రహ్మమే అన్న స్థిర భావన నిలిచిపోతుంది. అక్కడ నుండి ఆలోచన తీవ్రమై అనేక విషయాలను మనసు గ్రహించుకుని, ఈశ్వరస్పర్శ లేని వస్తువే లేదన్న స్పృహ కలుగుతుంది. ఇంతటి పవిత్రభావన మనసులో పొటమరించినప్పుడు, రాగము, ద్వేషము, దంభము, ప్రగల్భము, గర్వము, అహంకారము, అవిద్య, అనాచారం, అస్పష్టత, ఆభిజాత్యం, అజ్ఞానం వంటి దుర్లక్షణాలన్నీ మనసు నుండి నిష్క్రమించి, తెలియని ఒక ప్రసన్నత, హాయి, ప్రశాంతి కలిగి శుద్ధ మనస్సు ఏర్పడుతుంది. ఎవరి మీదా ఆధారపడని, ఎవరి నుండీ ఏమీ ఆశించని, ఎవరినీ శాసించని, అభిశంసించని నిర్మలతత్వం అనుభవంలోకి వస్తుంది.
ఇంత కాలమూ మనసు ద్వారా ప్రపంచాన్ని చూడటానికి అలవాటుపడిన దృక్పథం, అదే ప్రపంచాన్ని హృదయంతో చూడడంతో స్థిమితపడుతుంది. మనసుతో చూస్తే స్పర్థ, హృదయంతో చూస్తే ప్రశాంతత కలగటం సహజం!
ఇంతటి అనుభవం తరువాత, జీవితాన్ని లేదా మన అవనీ సంచారాన్ని ‘త్యాగం’ నడిపిస్తుంది. త్యాగమంటే ధన, వస్తు వితరణ కాదు. వదిలిపెట్టవలసిన అహంకార, మమకారాలను నియంత్రించుకుని, నిగ్రహించుకుని క్రమంగా నిరహంకార స్థితిని, నిర్మలబుద్ధిని సాధించుకోవటమే త్యాగం. దీని వలన, విజ్ఞాన, సుజ్ఞాన పరిధులను దాటి, మనసు ప్రజ్ఞాన భూమికలో సంస్థితమై, జగత్తును బ్రహ్మమయంగా దర్శించటం మొదలుపెడుతుంది.
అనేకత్వంలో ఏకత్వాన్ని సహజ సుందరంగా అనుభవించటం అలవాటు చేసుకుని అన్నిటా, అంతటా సమత్వాన్ని అనుభూతిమయం చేసుకుంటుంది. దీంతో జాతి, మత, వర్గ, వర్ణాలన్నీ, ఏకవర్ణం ఆవిష్కరించే ఏడు రంగుల ఇంద్రధనువుగా అనుభవించటం జరుగుతుంది. ఆపై స్పర్ధకు తావులేని విశాలభావన, మనసును ఆనంద సాగరంగా తీర్చిదిద్ది, జగత్తును మధుర సౌందర్యమయంగా, జీవితాన్ని జీవించటమనే సహజ కళాకలాపంగా కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియంతా ‘లోచూపు’ వలననే సంభవమవుతుంది.
పైచూపు ప్రకృతిని చూపిస్తే, లోచూపు ప్రకృతి మూలాలను తడిమి ఆనందించగల సర్వోత్తమ స్థితిని అనుగ్రహిస్తుంది. పదార్థ స్థాయి నుండీ యదార్థ స్థితికి సాగే సుందర ప్రస్థానమిది. సందేహంతో మొదలై, అన్వేషణగా సాగి, పరితృప్త స్థితిలో ఆగే అద్భుత ప్రయాణం ఇది.
జగత్తే బ్రహ్మమైనప్పుడు, జగత్తులో భాగమైన మనం బ్రహ్మము కాక మరేమవుతామన్న భావన, ఎంతో తృప్తిని, గౌరవాన్ని, మర్యాదను వరదానం చేస్తుంది.
ఈ పరిణామంతో, అంతవరకు జీవితాన్ని నడుపుతూ, గడుపుతూ సాగిస్తున్న క్షణాలు సమగ్రతను, సంపూర్ణతను సంతరించుకుని విస్తృత స్థాయిలో ఆనందాన్ని అనుభవించటం ఆరంభిస్తాయి. అంటే జీవితానికి ఒక పరమార్థమున్నదని, దాన్ని ఆనందోపాసనగా సాగించాలన్న స్ఫురణ కలిగి, అనేక భయాలను అధిగమించే విధంగా జీవన దృక్పథం మారిపోతుంది.
అన్ని భయాలలోనూ మృత్యుభయం దుర్భరమైనది. అటువంటి భయాలకు స్వస్తి పలికి, మరణమంటే ఈ జన్మకు వీడ్కోలనీ, మరొక జన్మకు స్వాగతమని, మరణం, అమరత్వాన్ని దాచుకున్న నిత్యగర్భాలయమని, మరణాన్ని మంగళంగా సంభావన చేయగలుగుతాం. మరణ భయం పోవటమంటే, మనం మరణమెరుగని ఆత్మలమని, దేహం వదలటమంటే మార్పేనన్న శుద్ధవైరాగ్యం, అభ్యాస యోగంగా మారుతుంది. ఆనందం బ్రహ్మమైతే, దాని స్వరూపమే ఈ జగత్తు. ఇదొక అభివ్యక్తి! ఈ లోకంటో లేనిది, మరొకచోట ఏమీ లేదు. రసస్వరూపుడైన ఈశ్వరుడి చల, అచల భావనిలయం ఈ ప్రపంచం.
సత్ నుండి సృష్టి, సృష్టి నుడి విశ్వం, విశ్వం నుండి ప్రపంచం, ప్రపంచం నుండి సంసారం, సంసారం నుండి వ్యక్తి ఏర్పడి ఈ ఆనంద ఖేలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాయి. ప్రపంచం ఆనంద నిలయం! ప్రపంచం ఆహ్లాద ఆరామం! దాన్ని స్వచ్ఛ హృదయంతో చూడటం నేర్చుకోవాలి. ఆపై దానిని ఆత్మ స్వరూపంగా దర్శించటం ప్రారంభించాలి. లభించిన ప్రతి క్షణాన్ని ఒడిసిపట్టాలి. అసమగ్రత నుండీ సమగ్రత వైపు, స్పష్టత వైపు, సంకుచితత్వం నుండీ విశాలతత్వం వైపు, జీవితాన్ని సమర్థవంతంగా, అర్థవంతంగా, పారమార్థికంగా, సంపూర్ణంగా జీవించాలి!
జగత్తు, మహాద్భుత వేదిక!
జీవితం, శివసుందరాత్వమకం!
ఈశోపనిషత్ మనల్ని ఆశావహ, యాదార్థిక, సత్య జీవనాన్ని సాగించమని ప్రబోధిస్తుంది!
వీఎస్‌ఆర్ మూర్తి






