21 August, 2026 | 6:30 PM

షావుకారు జానకి మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా: బాలకృష్ణ

21-08-2026 05:20 PM

ప్రముఖ నటి షావుకారు జానకి(Veteran Actress Sowcar Janaki Passes Away) 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన ఆమె, శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. షావుకారు జానకి తుదిశ్వాస విడిచారనే వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా అని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆమెతో నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, నాన్నకు జానకి తొలి హీరోయిన్ అని, ఆమె తొలి కథానాయకుడు మా నాన్న అని బాలయ్య గుర్తు చేసుకున్నారు. నాన్న హీరోగా తొలి చిత్రం 'షావుకారు'తో ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారని, మా ఎన్ఏటీ బ్యానర్ లో తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కీలకపాత్ర పోషించారని బాలకృష్ణ చెప్పారు. 75 ఏళ్లు సుదీర్ఘ నటనాప్రస్థానం చూసింది ఆమె ఒక్కరే అనుకుంటా అని, షావుకారు జానకి కుటుంబానికి మనోధైర్యం చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బాలయ్య తెలిపారు.