భారం తగ్గించొచ్చు
మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి
ఆలేరు,(విజయక్రాంతి): ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్(Bhongir Municipal Chairperson Tangallapalli Srivani Ravikumar) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజిలీ యోజన(PM Surya Ghar- Muft Bijli Yojana)పై విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
ఇంటి అవసరాలకు సరిపడా విద్యుత్‌ను సౌర విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేసుకోవడంతో పాటు, మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించే అవకాశం ఉందని తెలిపారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తోందని, లబ్ధిదారులకు రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, సోలార్ కంపెనీ ప్రతినిధులు పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం, సబ్సిడీ వివరాలు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు తదితర అంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్, మాజీ కౌన్సిలర్ కుక్కదువ్వ సోమయ్య, విద్యుత్ శాఖ ఏఈ, లైన్‌మెన్లు, స్థానిక నాయకులు, మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.