నీట్ పరీక్షలో మెరిసిన గిరిజన ఆణిముత్యం భూక్య కావేరి
సమాజ సేవలో రాణించుటకు డాక్టర్ కావాలనే కోరిక నెరవేరుతున్న... కావేరి లక్ష్యం.
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యతండ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని భూక్య కావేరి నీట్(NEET exam)లో ఘన విజయం సాధించింది. నీట్ పరీక్షలో 450 మార్కులు సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఖమ్మంలో సీటు సాధించింది. అడవి బిడ్డ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.సదుపాయాలు లేని చోట పుట్టినా,సరైన సదుపాయం లేని బడిలో చదివినా,పట్టుదలే పెట్టుబడిగా... కష్టాన్ని ఆయుధంగా మలచి,ఇవాళ వైద్య విద్యలో సీటు సాధించింది.
పేదరికం నా చదువును ఆపగలదేమో గానీ నా ఆశయాన్ని కాదు అని నిరూపించింది కావేరి. మా తండలో సరైన వైద్యం అందక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరి కళ్ళలోని బాధ నన్ను డాక్టర్ని చేయాలనుకునేలా ప్రేరేపించింది అన్నారు.చిన్ననాటి నుండే వైద్యురాలు కావాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివిన ఆమెకు తల్లిదండ్రులు భూక్య కిషన్ సరిత,ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోడైంది. భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి పేదలు, గిరిజనులు గ్రామీణ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కావేరి తెలిపింది.ఆమె విజయంపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.