25 August, 2026 | 2:36 AM

వివరాలివ్వకుండా కేంద్రంపై నెపమా?

25-08-2026 12:38 AM
  1. సీఎం రేవంత్ యూఎస్‌లో ఎవరిని కలవాలనుకున్నారు?
  2. ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే
  3. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్ ఆగస్టు 24 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి సరైన వివరాలు వెల్లడించకుండా, అనుమతి నిరాకరణపై కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు.  సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

గతంలో రేవంత్‌రెడ్డి రెండుసార్లు అమెరికాకు, లండన్, సింగపూర్ వెళ్లినప్పుడు అడ్డుకోని వారు  ఇప్పుడు ఎందుకు అనుమతి నిరాకరించారో గ్రహించాలన్నారు. యూపీఏ హయాంలో చం ద్రబాబు, కేసీఆర్, మాయావతి, తరుణ్ గ గో య్, అర్జున్‌ముండాతో పాటు మరికొందరు నేతల విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరించారని గుర్తు చేశారు. పేపర్లు సరిగ్గా లేకపోవడం, సరైన కారణాలు చెప్పకపోవడం, ఎవరిని కలుస్తున్నారో స్పష్టత ఇవ్వకపోవడంతో వారికి అనుమతివ్వలేదని పేర్కొన్నారు.

ఇది విదేశాంగ శాఖ నియమావళి ప్రకారమే జరుగుతుందని, దేశానికి వ్యతిరేకంగా ఎవరినైనా కలుస్తున్నారా? అనే అనుమానం ఉన్నప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుందని తెలిపారు. రేవంత్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. యూఎస్‌లో ఎవరిని కలవాలనుకున్నారు?ఎందుకు? అనే విషయాన్ని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

మోదీకి అన్ని రాష్ట్రాలూ సమానమే

ప్రధాని మోదీకి గుజరాత్ అయినా, తెలంగాణ అయినా దేశంలోని ఏ రాష్ట్రమైనా సమానమేనని, ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’తోనే కేంద్రం ముందుకెళ్తోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందిందంటే అది మోదీ, కేంద్ర ప్రభుత్వం వల్లేనని స్పష్టం చేశారు. జాతీయ రహదారులు, వరంగల్ ఎయిర్‌పోర్టు, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ఇచ్చింది కేంద్రమేనని పేర్కొన్నారు.