తండ్రి బాటలో తనయుడు
అత్యవసర వేళ రక్తదానం.. క్లిష్ట పరిస్థితిలో ఉన్న రోగికి అండగా మల్లుగారి సాయిజ్ఞాన్
తండ్రి బాటలో తనయుడు 15వ సారి రక్తదానం
గంభీరావుపేట,(విజయక్రాంతి): రక్తం అవసరమని తెలిసిన వెంటనే స్పందించి, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం(Blood donation) చేసి క్లిష్ట పరిస్థితిలో ఉన్న రోగికి అండగా నిలిచారు గంభీరావుపేటకు చెందిన మల్లుగారి సాయిజ్ఞాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామానికి చెందిన ఎడబోయిన నారాయణ (ఆర్ఎంపీ) జాండీస్ వ్యాధితో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి(NIMS Hospital)లో చికిత్స పొందుతున్నారు.
డయాలసిస్ కోసం రక్తం అవసరం కావడంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు సామాజిక మాధ్యమాల ద్వారా రక్తదాతల కోసం విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న రెడ్‌క్రాస్ సభ్యుడు మల్లుగారి సాయిజ్ఞాన్ వెంటనే స్పందించి నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఇది ఆయనకు 15వసారి రక్తదానం అని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మల్లుగారి నర్సాగౌడ్ కుమారుడైన సాయిజ్ఞాన్ కూడా తండ్రి బాటలో నడుస్తూ ఆపత్కాలంలో స్పందించి రక్తదానం చేయడం పట్ల నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, పలువురు అభినందనలు తెలిపారు.