రేవంత్ కుటుంబ వ్యాపారాలపై విచారణకు సిద్ధమా?
- రెండేండ్లలోనే రూ.50 వేల కోట్లకుపైగా సంపాదించారు
- వివరాలన్నీ కేంద్ర, రాష్ట్ర నాయకులందరికీ పంపుతాం
- కేంద్రంలోని బీజేపీ సమగ్ర విచారణ చేపట్టాలి: బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్
అక్టోబర్ 3 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల వ్యాపారాలు, పెట్టుబడులు, ఆస్తులపై విచారణ సిద్ధమా? అని బీఆర్‌ఎస్ అధికార ప్రతిని ధి మన్నె క్రిశాంక్ సవాల్(Manne Krishank's challenge) చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో(Telangana Bhavan) ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, వ్యాపార వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడే ఆయన ఇగో హర్ట్ అవుతుంది.
ప్రతిపక్ష నేతల కుటుంబా లు, వ్యాపారాలపై మాట్లాడే ముందు తన కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలపై కూడా సీఎం వివరణ ఇవ్వాలి’ అని క్రిశాంక్ డిమాండ్ చేశారు. ‘కేటీఆర్ తన హోటళ్లకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లోనే వెల్లడించారు. కిరాయి భవనంలో కేటీ ఆర్ హోటళ్లు నిర్వహిస్తే అందులో తప్పేముం ది? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తమ ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన అంశాలనే సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు గొప్పగా చెప్తున్నారు’ అని విమర్శించారు.
‘ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రారంభోత్సవాలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి.. మెడికవర్ ఆసుపత్రులను మాత్రం ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ బడుల నిర్మాణంపై దృష్టి పెట్టకుండా సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రైవేట్ ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి ప్రాధా న్యం ఇస్తున్నారు’ అని దుయ్యబట్టారు.
బ్లాక్ మనీ వైట్ చేసుకున్నరు
మెడికవర్ ఆస్పత్రిని నిర్మించిన సహృదయ హెల్త్‌కేర్ సంస్థ ఫైనాన్షియల్ పొటెన్షియల్ గత రెండేళ్లలో 689 శాతం పెరిగిందని, ఇంత తక్కువ వ్యవధిలో సంస్థ ఆర్థిక సామర్థ్యం ఇంత భారీగా ఎలా పెరిగిందని క్రిశాంక్ ప్రశ్నించారు. అనంతరం మెడికవర్ ఆసుపత్రిని రూ. 13,300 కోట్లకు విక్రయించారని, ఈ లావాదేవీలపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాం డ్ చేశారు. మెడికవర్ ఆస్పత్రిలో ప్రధాన షేర్ హోల్డర్‌గా ఉన్న దుంప శిరీష..
సీఎం అల్లుడు సత్యనారాయణరెడ్డి కంపెనీ బీఎన్ ఫార్మాలోనూ ప్రధాన డైరెక్టర్‌గా ఉన్నారని ఆయన ఆరోపించారు. వీటితోపాటు సీఎం కుమార్తె నైమిష రెడ్డి నిర్మిస్తున్న కొత్త పాఠశాలలోనూ దుంప శిరీష భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ స్కూల్లో దుంప శిరీష, అనుముల నైమిషరెడ్డి, గీతా ఆటోమోటివ్స్‌కు సంబంధించిన వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్నారని, ఒకే వ్యక్తి మెడికవర్ ఆసుపత్రి,
మాక్స్ బీఎన్ ఫార్మా, పాఠశాల వ్యాపారాల్లో భాగస్వామిగా ఎలా ఉన్నారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని క్రిశాంక్ డిమాండ్‌చేశారు. మెడికవర్ ద్వారా రూ.13 వేల కోట్ల బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారని, దుంప శిరీష పేరుతో బినామీ పెట్టుబడులు పెట్టి మెడికవర్ ఆసుపత్రిని రూ. 13,300 కోట్లకు విక్రయించారని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కొరియా పర్యటనకు, షోరూంలకు సంబంధమేంది?
రేవంత్‌రెడ్డి 2024 ఆగస్టులో దక్షిణ కొరియాకు వెళ్లి హ్యుండాయ్ కంపెనీ పెద్దలను కలిశారని, ఆ పర్యటన జరిగిన మూడు నెలల తర్వాత హైదరాబాద్‌లో ‘గీతా ఆటోమోటివ్స్’ పేరుతో ఐదు హ్యుండాయ్ షోరూంలు ప్రారంభమయ్యాయని క్రిశాంక్ ఆరోపించా రు. ‘కొరియా పర్యటనకు, ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రారంభమైన హ్యుండాయ్ షోరూంలకు మధ్య ఉన్న సంబంధాలపై వివరణ ఇవ్వాలి. నేను చేస్తున్న ఆరోపణలపై రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు బహిరంగ చర్చకు రావాలి.
ఈ ఆరోపణలు తప్పని వారు నిరూపిస్తే ఇకపై సీఎం కుటుంబం గురించి మరో సారి మాట్లాడబోను. బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం’ అని ఆయన ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రేవంత్‌రెడ్డి కుటుంబం రూ.50 వేల కోట్లకు పైగా సంపాదించుకుందని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపారాలు, కంపెనీలకు సంబంధించిన వివరాలను సేకరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు పంపుతున్నామని ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ డిమాండ్ చేశారు.