సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు

30-09-2026 | 11:42pm

- ప్రజల తరఫున ప్రశ్నిస్తే అరెస్టులా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ నాయకులు

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District)లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, ప్రజా సమస్యలపై ప్రశ్నలు వినిపించకుండా నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌(BRS) నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేయాలని చూస్తోందని వారు ఆరోపించారు.

నేతన్నలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నలు అడగకుండా పోలీసు బలగాలతో నాయకులను అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు.సీఎం పర్యటనకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల గొంతును నొక్కడం ప్రభుత్వ బాధ్యత కాదని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు.అరెస్టులను వెంటనే నిలిపివేసి, అదుపులోకి తీసుకున్న నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కుతో పాటు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే హక్కును ప్రభుత్వం గౌరవించాలని వారు కోరారు. అరెస్ట్ అయిన వారిలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచి నాగరాజు, చిట్నేని శివతేజ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు తెగమంటి ఎల్లారెడ్డి, మాదాసు భూమయ్య,తదితరులు వున్నారు.

మరిన్ని వార్తలు