5 September, 2026 | 11:28 PM

నా జన్మభూమి స్టేషన్ ఘన్‌పూర్.. నా కర్మభూమి జనగామ..!

05-09-2026 | 10:17pm

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ,(విజయక్రాంతి): జనగామ(Janagama)లో శనివారం రాజకీయం హోరెత్తింది. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు బీఆర్ఎస్(BRS) శ్రేణులు భారీ ర్యాలీ తీశారు. ఎటు చూసినా గులాబీ జెండాలు, జై కేసీఆర్.. జై పల్లా.. జై బీఆర్ఎస్.. వద్దురా కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలతో జనగామ దద్దరిల్లింది. అనంతరం చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) వైఫల్యాలపై మహాధర్నా నిర్వహించారు. మహిళలు, విద్యార్థులు, రైతులు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Dr. Palla Rajeshwar Reddy) మాట్లాడుతూ... జనగామతో నా అనుబంధం శాశ్వతం నేను పుట్టిన భూమి స్టేషన్ ఘన్‌పూర్ నా జన్మభూమి, జనగామ నా కర్మభూమి. రాజకీయాల్లో ఉన్నంతకాలం మీ ఆశీర్వాదంతో జనగామలోనే ఉంటా. ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా. జనగామను చస్తేనే వదులుతా తప్ప వదిలే ప్రసక్తే లేదు.

జనగామలోని 277 పోలింగ్ బూత్‌లు, 131 గ్రామాలు, 42 వార్డులు, 8 మండలాలు, 2 పట్టణాల్లో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని గ్యారంటీ కార్డు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ కార్డును దాచుకోమని భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. మరి ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా? ప్రతి నెలా ఆడబిడ్డల ఖాతాల్లో రూ.2500 వేస్తామని చెప్పారు. వచ్చే నెల మొదటి తేదీ నుంచే ఇస్తామన్నారు. ఇంతకాలం అయినా ఆ డబ్బులు ఎందుకు పడలేదు? మహిళలకు స్కూటీలు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం + రూ.లక్ష ఎక్కడ? రూ.4 వేల పింఛన్ ఏమైంది? ఈ నెల రూ.2 వేలు, వచ్చే నెల నుంచి రూ.4 వేల పింఛన్ అని తీయగా, బెల్లం పూసిన మాటలు చెప్పారు.

ఇప్పటికీ రూ.2 వేల దగ్గరే ఉంది. వికలాంగులకు(Disabled) రూ.6 వేల హామీ ఏమైంది? రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, రెండు లక్షల ఉద్యోగాల హామీని విస్మరించారు. కేసీఆర్ హయాంలో వేల నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇప్పుడు అరకొర నోటిఫికేషన్లతో మోసం చేస్తున్నారు. పోలీసు శాఖలో 20 వేలు, డీఎస్సీ ద్వారా 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి. రైతులకు నీళ్లు, కరెంట్, యూరియా కరువు కేసీఆర్ హయాంలో రైతుబీమా ద్వారా 1.85 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అండగా నిలిచాం. 10 రోజుల్లో డబ్బు అందే వ్యవస్థ పెట్టాం. బచ్చన్నపేట గుడి చెరువు, తపాస్‌పల్లి, గండిరామారం, చీటకోడూరు రిజర్వాయర్లను నింపి 26 గ్రామాలకు నీళ్లిచ్చాం.

ఇప్పుడు రైతులు నీళ్లు, కరెంట్, యూరియా, రైతుబంధు, రైతుబీమా కోసం ఇబ్బంది పడుతున్నారు. 24 గంటల కరెంట్ అని చెప్పి 5-6 గంటలు కూడా ఇవ్వడం లేదు. జనగామను జిల్లా చేసినందుకా కేసీఆర్ రాజీనామా చేయాలి? మెడికల్ కాలేజీ, పెద్ద ఆసుపత్రి ఇచ్చినందుకా? దేవాదుల నీటిని జనగామకు తెచ్చి 80% ప్రాంతానికి నీళ్లిచ్చినందుకా? 250 చెరువులు నింపినందుకా? ప్రజలు 5 ఏళ్లు పాలించమని అధికారం ఇచ్చారు, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీదే, గత ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. బాణాపూర్‌లో కేసీఆర్ హయాంలో కట్టిన 550 డబుల్ బెడ్‌రూం ఇళ్లలో పేదలకు న్యాయం చేయకుండా సమస్యలు సృష్టిస్తున్నారు. అర్హులకు న్యాయం జరగాలి, లేకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం. హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగదని పల్లా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు