కులమత భేదాలతో చూడొద్దు
ముస్తాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలోని అంబేద్కర్ సంఘ భవనంలో బుధవారం డిప్యూటీ తహసిల్దార్ అపర్ణ అధ్యక్షతన పౌర హక్కుల సమావేశం (Civil Rights Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీ అపర్ణ మాట్లాడుతూ గ్రామంలో కుల వివక్ష, రెండు గ్లాసుల విధానం వంటి అంశాలు ఇంకా కొనసాగుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అంటరానితనం, అసమానతలు ఉండకూడదని అన్నారు. సమసమాజ నిర్మాణం కోసం రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు (Equal Rights) కల్పించిందని తెలిపారు.
హెచ్చుతగ్గులు, కులమత భేదాలకు తావులేకుండా అందరూ సమానంగా జీవించాలని సూచించారు. ఎవరైనా వివక్షకు (Discrimination) పాల్పడితే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్ మాట్లాడుతూ అక్కడక్కడా కొందరిలో అవగాహన లేకపోవడం వల్ల కుల వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. మనమంతా ఒక్కటే అనే భావనపై గ్రామ సభల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం నిరంతరం అవగాహన (Awareness) కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్కదాసరి రవీందర్, జీపీఓ శ్రీనివాస్, కార్యదర్శి మల్లికార్జున, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నేరెళ్ల స్వామి, వార్డు సభ్యులు స్వామి, శ్రీకాంత్, రమేష్, బాలయ్య, సంఘ సభ్యులు శ్రావణ్, సింహాద్రి, రాజేష్, రాజయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.