ఆసియా క్రీడల్లో గోల్డెన్ షో!
హైదరాబాద్: ఆసియా క్రీడలు 2026లో తెలంగాణ ఆర్చర్ చికిత తానిపర్తి మరోసారి సత్తా చాటింది. జపాన్ వేదికగా జరుగుతున్న క్రీడల్లో వరుస విజయాలతో దూసుకెళ్లిన చికిత.. ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. అంతేకాకుండా 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను కూడా సాధించింది. చికితతో పాటు సాహిల్ జాదవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు.
చికితకు డబుల్ గోల్డ్.. ఒలింపిక్స్ బెర్త్
ఆర్చరీలోని కాంపౌండ్ ఉమెన్స్ టీమ్ విభాగంలో చికిత స్వర్ణ పతకం సాధించారు. అనంతరం సాహిల్ జాదవ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి, ఫైనల్ పోరులో దక్షిణ కొరియా జోడీని ఓడించి మరో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఒకేరోజు రెండు స్వర్ణాలతో తెలంగాణ క్రీడాభిమానులను ఉత్సాహపరిచింది.
తెలంగాణకు గర్వకారణం: సీఎం రేవంత్
చికిత విజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు సాధించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని సీఎం అభినందించారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన చికిత తన ప్రతిభతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కోచ్‌లను కూడా సీఎం అభినందించారు.
కఠోర సాధన, పట్టుదల, లక్ష్యంపై దృష్టితో చికిత సాధించిన విజయం భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డబుల్ గోల్డ్‌తో పాటు ఒలింపిక్స్ అర్హత సాధించడం చికిత కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఆమె విజయంతో తెలంగాణ ఆర్చరీకి అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు లభించినట్లైంది.
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడమే కాకుండా 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానిపర్తితో పాటు సాహిల్ జాదవ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ.… https://t.co/1x02v6OqzL pic.twitter.com/KOC1JgvXRO
— Telangana CMO (@TelanganaCMO) September 30, 2026