భూసేకరణ చట్టబద్ధంగా చేపట్టాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో(IDOC Office) భూసేకరణ చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్, సింగరేణి, జెన్‌కో, జాతీయ రహదారుల వంటి ప్రాజెక్టులకు భూసేకరణ జరుగుతోందన్నారు. అర్హులైన రైతులకు చట్టప్రకారం పరిహారం, పునరావాస ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఓఎస్డీ మనోహర్ మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో ప్రతి దశను పక్కాగా నమోదు చేయాలని, భూమి విస్తీర్ణం, రికార్డుల విషయంలో పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు.ఈ
కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఆర్డీఓ హరికృష్ణ, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.